ఏమండోయ్ నాని గారూ…?

ఆయన వైద్యఆరోగ్య శాఖ మంత్రి. కానీ రాష్ట్రమంతా తిరుగుతారు. కరోనా కట్టడికి అనేక సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులను పరిశీలిస్తారు. కానీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం కరోనా [more]

Update: 2020-08-22 06:30 GMT

ఆయన వైద్యఆరోగ్య శాఖ మంత్రి. కానీ రాష్ట్రమంతా తిరుగుతారు. కరోనా కట్టడికి అనేక సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులను పరిశీలిస్తారు. కానీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం కరోనా ను పట్టించుకోరు. ఆయనే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని. ఆళ్లనాని సౌమ్యుడు. వివాదం లేని నేత. ఇంతవరకూ బాగనే ఉన్నా… ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా ఇది వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని పై ప్రభావం చూపనుంది.

జిల్లాలు తిరుగుతున్నా….

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తుంటారు. మీడియా సమావేశాలు పెడుతుంటారు. కానీ ఆళ్ల నాని మాత్రం ముఖ్యమంత్రి జగన్ నిర్వహించే కోవిడ్ సమీక్షలకు హాజరవుతుంటారు. ఇక ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన భూముల కోసం ఆళ్లనాని గడచిన కొంతకాలంగా ఏపీ అంతటా పర్యటిస్తున్నారు. అక్కడ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు.

సొంత జిల్లాలో మాత్రం…..

కానీ ఆళ్లనాని తన సొంత జిల్లాను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2.50 లక్షలు దాటేశాయి. ఇక వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఇరవై వేలు దాటేశాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అందులోనూ ఆళ్లనాని సొంత నియోజవర్గమైన ఏలూరులోనూ కరోనా కేసుల సంఖ్య పదివేలకు పైగానే ఉన్నాయి. కానీ సొంత జిల్లా, నియోజకవర్గంలో కరోనా పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఆళ్లనాని తీసుకోలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

పెరుగుతున్న కేసులతో…..

సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆళ్ల నాని అనుచరులే అంతా చక్కదిద్దుతున్నారట. క్వారంటైన్ సెంటర్లలో కనీస వసతులు లేక రోగులు ఆందోళనకు దిగుతున్నారు. కరోనా రోగులను తరలించేందుకు సరైన రవాణా ఏర్పాట్లు లేవు. ఇక పరీక్షలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో సక్రమంగా జరగడం లేదంటున్నారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో కరోనా రోగులు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రమంతా తిరిగి కరోనాను కట్టడి చేస్తానంటూ సూక్తి ముక్తావళి చెబుతున్న మంత్రి ఆళ్లనాని ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవాలంటూ సెటైర్లు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News