మోడీకి ఇంకా మొక్కులేనా ?

నరేంద్ర మోడీ. కరడు కట్టిన ఆరెస్సెస్ భావజాలం. కఠినమైన గుజరాతి వ్యక్తిత్వం కూడా ఆయన సొంతం. జాతీయ నేతగా మోడీ ఉన్నా కూడా తర తమ పరిధులను [more]

Update: 2020-09-02 02:00 GMT

నరేంద్ర మోడీ. కరడు కట్టిన ఆరెస్సెస్ భావజాలం. కఠినమైన గుజరాతి వ్యక్తిత్వం కూడా ఆయన సొంతం. జాతీయ నేతగా మోడీ ఉన్నా కూడా తర తమ పరిధులను దాటలేదని అంటారు. ప్రధానిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఆయన ఆచరణలో ఫక్త్ గుజరాతీగా వ్యవహ‌రిస్తారని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రాల సమాఖ్యగా కేంద్రం ఉండాలి. నిధులు అన్నీ కూడా సమానంగా పంచాలి. కానీ కేంద్రంలో మాత్రం ఎవరు ప్రధానులుగా ఉన్న తమ సొంత రాష్ట్రాలకు, తమ పార్టీలు అధికారంలో ఉన్న చోట ఎక్కువగా నిధులు ఇస్తూ నోరు లేని రాష్ట్రాలను అన్యాయం చేస్తూ పోతున్నారు. ఇపుడు జీఎస్టీ వివాదంతో మోడీ ఏకంగా అన్ని రాష్టాలకు హ్యాండ్ ఇచ్చేశారు. దాంతో రాష్ట్రాధిపతులు రగులుతున్నారు.

హరీష్ అదిలించారుగా…

ఈ మధ్యన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ జీఎస్టీ గురించి అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం నుంచి ఈసారికి జీఎస్టీ పన్నుల వాటా ఆశించవద్దు అని గట్టిగా చెప్పేశారు. ఎందుకంటే నెలకు లక్ష కోట్ల దాకా రావాల్సిన జీఎస్టీ ఆదాయం దారుణంగా పడిపోయిందట. అందువల్ల కేంద్రానికే ఏమీ లేక గోళ్ళు గిళ్ళుకుంటోందని, మీకు వాటాలు పంచలేమని కుండబద్ధలు కొట్టేశారు. దీని మీద తెలంగాణా అర్ధిక మంత్రి హరీష్ రావు బాగానే ఫైర్ అయ్యారు. ఇది అన్యాయం, మా వాటా మాకు ఇవ్వాల్సిందే అంటున్నారు. అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని కూడా హెచ్చరించారు.

అంతా కలసి ఒక్కటిగా…..

జీఎస్టీ పన్నుల పంపిణీ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్క త్రాటి మీద నిలిచి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని అపుడే నినాదం పుట్టింది. దీని మీద కసరత్తు కూడా జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్రాలతో పాటు లెఫ్ట్ పార్టీలు, మమతా బెనర్జీ వంటి వారు గొంతు విప్పుతున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఇప్పటికైతే ఖండించనూ లేదు, ఏ విధంగానూ రెస్పాండ్ అవలేదు. ఇది నిజంగా విచిత్రమేనని అంటున్నారు. ఎందుకంటే జీఎస్టీ వాటాగా నెలకు దాదాపుగా మూడు వేల కోట్ల వరకూ ఏపీకి వస్తాయి. మరి ఆ మొత్తం ఏపీకి ఇపుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం కూడా. కానీ జగన్ ఇంతటి మొత్తం ఇవ్వను అని మోడీ తెగేసి చెబుతున్నా పెదవి విప్పడంలేదని అంటున్నారు.

అన్యాయమే ….

కేంద్రం తెలివిగా రుణ పరిమితిని పెంచుతామని అప్పులు చేసుకోండని రాష్ట్రాలకు ఉచిత సలహా ఇస్తోంది. దానికి తలఊపి 20 వేల కోట్ల అప్పునకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. అదే న్యాయంగా రావాల్సిన జీఎస్టీ నిధులు ఉంటే ఈ అప్పుల తిప్పలు తప్పుతాయి కదా అని మేధావులు, ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. చేసేఆ అప్పేదో కేంద్రమే చేసుకుని రాష్ట్రాలను ఆదుకోవాలన్న డిమాండ్ కూడా వస్తోంది. అయితే జగన్ మాత్రం మోడీని పల్లెత్తు మాట అనేందుకు రెడీగా లేరని అంటున్నారు. విపక్ష తెలుగుదేశం కూడా అప్పులు చేస్తున్నారు అని జగన్ ని నిందిస్తున్నారు తప్ప మోడీ జీఎస్టీ నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని అనలేకపోతున్నారు. బీజేపీతో పొత్తుతో పవన్ కూడా అలాగే తయారయ్యారు. ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్, కమ్యూనిస్టులే మాట్లాడాలి. దీంతో ఏపీ రాజకీయంగా కూడా మోడీ మీద నోరెత్తలేక అన్ని రకాలుగా అన్యాయం అవుతోందని అంటున్నారు. జగన్ ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో కలసి మోడీ సర్కార్ని నిలదీయాలని అంటున్నారు.

Tags:    

Similar News