ఇక్కడ అంతా నాన్ లోక‌ల్ నేత‌లదే డామినేష‌న్‌

రాజ‌కీయాల్లో సాదార‌ణంగా నాన్‌లోక‌ల్ నాయ‌కులకు పెద్దగా గుర్తింపు ఉండ‌దు. ఎక్కడైనా ఎవ‌రైనా నాన్‌లోక‌ల్ లీడ‌ర్ గెలిస్తే గొప్పే అనుకునే ప‌రిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే, [more]

Update: 2020-08-23 05:00 GMT

రాజ‌కీయాల్లో సాదార‌ణంగా నాన్‌లోక‌ల్ నాయ‌కులకు పెద్దగా గుర్తింపు ఉండ‌దు. ఎక్కడైనా ఎవ‌రైనా నాన్‌లోక‌ల్ లీడ‌ర్ గెలిస్తే గొప్పే అనుకునే ప‌రిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే, దీనికి భిన్నంగా కొన్ని ద‌శాబ్దాలుగా ప్రకాశం జిల్లాను ఏలుతున్న నాయ‌కులు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా అంద‌రూ నాన్ లోక‌ల్ లీడ‌ర్స్ కావ‌డం గ‌మనార్హం. వీరి జాబితా పెద్దదిగానే ఉన్నప్పటికీ.. చాలా ఇంట్రస్టింగ్‌. వీరికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు నాన్‌లోక‌ల్ అయిన‌ప్పటికీ.. పాలిటిక్స్ మాత్రం తిరుగులేకుండా చేస్తుండడం చాలా విశేష‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మాగుంట శ్రీనివాసుల రెడ్డి: ఈయ‌న ప్రస్తుతం ఒంగోలు వైఎస్సార్ సీపీ ఎంపీ. వాస్తవానికి ఈయ‌న‌ది నెల్లూరు. అయిన‌ప్పటికీ.. కాంగ్రెస్‌లో ఉన్న ‌స‌మ‌యంలోను, టీడీపీలో ఉన్నప్పుడు.. ఇప్పుడు వైఎస్సార్ సీపీలో ఉన్న స‌మ‌యంలోనూ ఒంగోలులోనే చక్రం తిప్పుతున్నారు. ఆయ‌న ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు.. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు. మొన్న ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వైఎస్సార్‌సీపీ నుంచి మ‌ళ్లీ ఎంపీగా గెలిచారు.

దామ‌చ‌ర్ల జ‌నార్దన్: ఈయ‌న కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలోని టంగుటూరు మండ‌లం తూర్పునాయుడు పాలెంకు చెందిన నాయ‌కుడు. అయితే, నిజానికి ఈయ‌న రాజ‌కీయాలు అన్నీ కూడా ఒంగోలు కేంద్రంగానే న‌డుస్తున్నాయి. గ‌తంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012 ఉప ఎన్నిక‌ల నుంచి ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా మూడుసార్లు పోటీ చేసిన జ‌నార్థన్ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం జ‌నార్థన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

బాలినేని శ్రీనివాస‌రెడ్డి: ఈయ‌న అటు మంత్రిగా, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఒంగోలులో చ‌క్రం తిప్పుతున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. పార్టీని జిల్లాలో త‌న క‌నుస‌న్నల్లో న‌డిపిస్తున్నారు. కానీ, ఈయ‌న కూడా నాన్‌లోక‌ల్‌. ఈయ‌ది కూడా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలోని టంగుటూరు మండ‌ల‌మే. బాలినేని జిల్లా కేంద్రంలో ఏకంగా 1999 నుంచి పాతుకుపోయారు. ముందు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఆయ‌న ఇప్పుడు వైసీపీలోనూ ఎమ్మెల్యే అవ్వడంతో పాటు మంత్రి అయ్యారు.

టీజేఆర్‌. సుధాక‌ర్ బాబు: సంత‌నూత‌ల‌పాటు ఎమ్మెల్యే. అయితే, ఈయ‌న ది వాస్తవానికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం. 2012లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్కడ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. త‌ర్వాత ఇప్పుడు ఏకంగా జిల్లా మారి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అయ్యారు.

పోతుల రామారావు: ఈయ‌న కూడా నాన్‌లోక‌ల్‌. 2014లో వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున కందుకూరులో విజ‌యం సాధించారు. ఈయ‌న‌ది కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలోని టంగుటూరు మండ‌లం. 2004లో కొండ‌పి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ త‌ర్వాత వైసీపీ నుంచి కందుకూరులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

బుర్రా మ‌ధుసూద‌న్‌యాద‌వ్: ఈయ‌న క‌నిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే. వాస్తవానికి కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలోని టంగుటూరు మండ‌లానికి చెందిన నాయ‌కుడు. బెంగ‌ళూరు రియ‌ల్ ఎస్టేట్‌లో ఆరితేరిన మ‌ధు 2014లో క‌నిగిరిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి.. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

శిద్దా రాఘ‌వ‌రావు: 2014లో ద‌ర్శి నుంచి విజ‌యం సాధించి మంత్రి పీఠం ఎక్కారు. ఈయ‌న కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గానికి నాన్‌లోక‌ల్‌. ఆయ‌న జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉంటారు. టీడీపీ నుంచి 2004లో ఒంగోలు ఎమ్మెల్యేగా ఓడిన ఆయ‌న ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఆ త‌ర్వాత 2014లో ద‌ర్శి ఎమ్మెల్యే అవ్వడంతో పాటు మంత్రి అయ్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీగా ఓడిపోయి… కొద్ది రోజుల క్రిత‌మే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

బూచేప‌ల్లి శివ‌ప్రసాద్: ఈయ‌న కూడా ద‌ర్శిలోనే చ‌క్రం తిప్పుతున్నారు .వాస్తవానికి ఈయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సంత‌నూత‌ల‌పాడు. ఇక్కడి చీమ‌కుర్తి సొంత ప్రాంతం. అయితే సంత‌నూత‌ల‌పాటు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావడంతో బూచేప‌ల్లి ఫ్యామిలీ ద‌ర్శిలో రెండు ద‌శాబ్దాలుగా తిష్టవేసింది. బూచేప‌ల్లి సుబ్బారెడ్డి 2004లో, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు శివ‌ప్రసాద్‌రెడ్డి 2009లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఆదిమూల‌పు సురేష్: వైఎస్సార్ సీపీలో మంత్రిగా ఉన్నారు. ఎర్రగొండ‌పాలెం ఎమ్మెల్యే. అయితే, గ‌త ఐదేళ్లు కూడా త‌న‌కు సంబంధం లేని సంత‌నూత‌ల‌పాడులో చ‌క్రం తిప్పారు. ఈయ‌న మార్కాపురంలో ఉంటారు. రెండు సార్లు య‌ర్రగొండ‌పాలెం నుంచి ఓ సారి సంత‌నూత‌ల‌పాడు నుంచి కూడా ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు.

మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌: ద‌ర్శి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న ఫేస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల అధినేత‌. 2009లో ప్రజారాజ్యం నుంచి ద‌ర్శిలో ఓడిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా వైసీపీ నుంచి పోటీ చేసి ద‌ర్శి ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న ఒంగోలులో నివాసం ఉన్నా ఎక్కువుగా బెంగ‌ళూరులోనే ఉంటార‌న్న టాక్ ఉంది.

గొట్టిపాటి ర‌వికుమార్‌: ప‌్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌.. ఓట‌మి లేకుండా నాలుగు సార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌స్తున్నారు. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ర‌వి 2004లో కాంగ్రెస్ నుంచి మార్టూరులో, 2009లో అదే కాంగ్రెస్ నుంచి అద్దంకిలో ఎమ్మెల్యే అయ్యారు. 2014లో అద్దంకి నుంచి వైసీపీ త‌ర‌పున‌, గ‌త ఎన్నిక‌ల్లో అదే అద్దంకిలో టీడీపీ త‌ర‌పున నాలుగో సారి ఎమ్మెల్యే అయ్యారు. మూడు పార్టీల నుంచి కూడా ఓట‌మి లేకుండా ఎమ్మెల్యే అయిన ఘ‌న‌త ర‌వి సొంతం. మార్టూరు ర‌ద్దు కావ‌డంతో ఆయ‌న అద్దంకిలో వ‌రుస విజ‌యాల‌తో రాజ‌కీయం శాసిస్తున్నారు.

Tags:    

Similar News