త్రీ X త్రీ = త్రీ అయిందిగా

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అన్ని పార్టీలనూ మూడు ముక్కలు చేశారు. ఈ నెల 20వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు మూడు రాజధానులకు అధికారిక [more]

Update: 2020-01-16 02:00 GMT

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అన్ని పార్టీలనూ మూడు ముక్కలు చేశారు. ఈ నెల 20వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు మూడు రాజధానులకు అధికారిక ముద్ర పడనుంది. దీంతో జగన్ ఈ పొలిటికల్ గేమ్ లో సక్సెస్ అయ్యారంటున్నారు. నిజానికి మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తెచ్చిన నాటి నుంచి అన్ని పార్టీలు బేధాభిప్రాయాలతో సతమతమవుతున్నాయి. చంద్రబాబు తొలినాళ్లలో పెద్దగా రెస్సాన్స్ కాకున్నా తర్వాత ఆయన అమరావతివైపు మొగ్గు చూపారు.

త్రీ క్యాపిటల్ గేమ్ లో…

ఈ త్రీ క్యాపిిటల్స్ గేమ్ లో తొలుత బలి అయింది ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మాత్రమేనని అంటున్నారు. కాదంటే స్థానికంగా దెబ్బతినిపోతామని భావించి టీడీపీ నేతల్లో చీలిక వచ్చింది. చంద్రబాబు అమరావతికి ఫిక్స్ కావడంతో విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు విశాఖకు రాజధానికి జై కొట్టారు. రాయలసీమ టీడీపీ నేతలు విశాఖ రాజధాని వద్దంటున్నారు కాని హైకోర్టు మాత్రం తమకు కావాల్సిందేనంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కూడా మూడు వర్గాలుగా విడిపోయారు. చంద్రబాబు సీమ జిల్లాలో పర్యటించినా కేవలం టీడీపీ కార్యకర్తలు తప్ప సామాన్యుల నుంచి పెద్దగా సానుకూలత లభించలేదు.

జనసేన కూడా…

ఇక మరోపార్టీ జనసేన కూడా త్రీ క్యాపిటల్ అంశంలో దెబ్బతినిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిని తరలించవద్దని చెబుతుంటే ఆయన సోదరుడు చిరంజీవి స్వాగతించారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సయితం జగన్ ప్రతిపాదనకే జై కొట్టారు. విశాఖ‌ జనసేన నేతలు కూడా జగన్ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ తొలుత రాజధాని తరలింపును వ్యతిరేకించినా తర్వాత రాజధాని రైతుల పక్షాన నిలవాల్సి వచ్చింది.

బీజేపీ, సీపీఐ సయితం….

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో సయితం మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో చీలిక వచ్చింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వంటి వారు వ్యతిరేకిస్తుంటే కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, పురంద్రీశ్వరిలు మాత్రం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక సీపీఐ లో కూడా చీలిక వచ్చింది. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, కర్నూలు సీపీఐ నేతలు మాత్రం జగన్ ప్రతిపాదనను సమర్థిస్తుండటం గమనార్హం. ఇలా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన విపక్ష పార్టీల్లో చీలిక తెచ్చిందనే చెప్పాలి.

Tags:    

Similar News