అంకెలు కుదరడం లేదా...??

Update: 2018-11-27 15:30 GMT

మొత్తమ్మీద తెలంగాణలో పోటాపోటీ రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో రాజకీయపార్టీలు సక్సెస్ అయ్యాయి. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఓటర్లలో ఉద్వేగం ఏర్పడింది. నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షం గా ఎన్నిక సాగిపోతుందనుకున్న పరిస్థితి నుంచి ఏమవుతుందో తెలియని సస్పెన్స్ స్థాయికి తేగలిగారు. కూటమి కట్టడం మంచిదే అయ్యింది. లేకపోతే ఓట్ల చీలికతో కారు పరుగు కేక్ వాక్ లాగా మారిపోయి ఉండేది. అసంతృప్తులు , ఆవేదనలు ఉన్నప్పటికీ కూటమి పార్టీలు రాజీ పడ్డాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాయకులు తమలో విభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టారు. ఒకే మాట ఒకే బాట అంటూ సోనియా సభ సాక్షిగా చాటి చెప్పారు. ప్రచార రథాన్ని పరుగులు తీయించడానికి సిద్ధమయ్యారు. రంగంలోకి దిగారు. అటు టీఆర్ఎస్ ఇప్పటికే అధినేత సుడి గాలి పర్యటనలతో జోరు మీద ఉంది. ప్రజాక్షేత్రంలో బలాబలాల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులపై అంచనాలు మొదలయ్యాయి.

హస్తం హవా నాలుగు...

తమకు బలమైన నియోజకవర్గాలు ఏమేమిటన్న విషయంలో కాంగ్రెసు పార్టీ సొంత అంచనాలు వేసుకుంటోంది. ఆ నియోజకవర్గాలు పట్టు జారకుండా చేజిక్కించుకోవడం లక్ష్యంగా వ్యూహాలు రాసుకుంటోంది. అదే సమయంలో కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే లభించే స్థానాలపైనా దృష్టి పెడుతోంది. సామాజిక సమీకరణలు, అభ్యర్థుల ఆర్థిక , అంగబలాలను పరిగణనలోకి తీసుకుని గణాంకాలు తీస్తున్నారు. జిల్లాల వారీ ప్రాబల్యం చాటుకునే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యత సాధిస్తుందని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తెలుగుదేశం, సీపీఐ చేరిక తర్వాత అధికసీట్లు లభించే అవకాశాలు మెరుగు పడ్డాయని భావిస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో టీఆర్ఎస్ కంటే కాంగ్రెసు అభ్యర్థులు చాలా పాప్యులర్ లీడర్లు. ఆర్థికంగాను, అంగబలం రీత్యాను అధికారపార్టీని నిలువరించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ప్రధానమైన ఈ నాలుగు జిల్లాలతోపాటు మిగిలిన ఆరు జిల్లాల్లో కలిపి కాంగ్రెసు పార్టీకి ఒంటరిగా 26 నియోజకవర్గాలు కచ్చితంగా గెలిచే చాన్సు ఉన్నట్లుగా పార్టీ నిర్ధారణకు వచ్చింది. అభ్యర్థులతోపాటు గతంలో అక్కడ లభించిన విజయాలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల అధారంగా ఈ మేరకు లెక్క ఖాయం చేసుకున్నారు.

కారు రేసులో ఆరు...

ముందస్తు ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించుకున్న అధికార తెలంగాణ రాష్ట్రసమితికి అసెంబ్లీ రద్దు నాటికి చాలా అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలతో కలిపితే జాతీయ పార్టీలకు కొంత మేరకు ఎడ్జ్ ఉంటుందనే అంచనాతో కేసీఆర్ అసెంబ్లీకి విడిగా ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. దానివల్ల ఏకపక్షంగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చని భావించారు. అజెండా తన చుట్టూ తిరిగితే గెలుపు సులభమవుతుందని అంచనా వేశారు. బీజేపీ, కాంగ్రెసు, కేంద్రప్రభుత్వం అన్నవి ఇర్రిలవెంట్ అంశాలుగా మార్చాలనే కేసీఆర్ వ్యూహం సరైనదే. అయితే తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ జనసమితి , సీపీఐ వంటి పార్టీలన్నీ ఒకే గూటి కిందకి రావడంతో టీఆర్ఎస్ గుత్తాధిపత్యానికి గండి పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. బలమైన పోటీగా కూటమి తయారైంది. తాజాగా తటస్థులు వేస్తున్న గణాంకాల్లో టీఆర్ఎస్ ఆరు జిల్లాల్లో హస్తం కంటే పైచేయి లో ఉన్నట్లు తేల్చారు. 35 నియోజకవర్గాల్లో కారు స్పీడుకు బ్రేకుల్లేవని లెక్క గట్టారు. ఈ గణాంకాలు సైతం గత విజయాలు, టీఆర్ఎస్ ప్రాబల్యం, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాస్తవిక అంచనాగా చెబుతున్నారు.

సుడి ’వారం‘...

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత ప్రచారంలో ముందు వరసలో ఉన్నారు. అన్నిపార్టీలకంటే అధికారపార్టీ కాన్వాసింగులో అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రథమకుటుంబంగా పిలుచుకునే కేసీఆర్ పరివారం మొత్తం రాష్ట్రాన్ని చుట్టుముట్టేస్తోంది. ఆరునెలల ముందునుంచే అన్నీ సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచారం ఫుల్ స్వింగ్ లోకి చేరింది. కేసీఆర్ రోజుకు ఆరు నియోజకవర్గాలకు తగ్గకుండా సభల్లో పాల్గొంటున్నారు. ఇక కేటీఆర్, హరీశ్ ల సంగతి చెప్పనక్కర్లేదు. రోడ్డు షోలు, సభలతో హోరెత్తిస్తున్నారు. సోనియా సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెసు ఇక రాహుల్ నూ రంగంలోకి దింపబోతోంది. ఎంతగా సుడిగాలి పర్యటనలు చేసినా, ప్రస్తుతమున్న పరిస్థితి మాత్రం ఏ పార్టీకి పూర్తి అనుకూలతను ఇవ్వడం లేదు. కచ్చితంగా వస్తాయనుకుంటున్న సీట్లను కలుపుకుంటే కాంగ్రెసు పార్టీ సర్కారు ఏర్పాటు చేయాలంటే సొంతంగా మరో 34 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. ప్రజాకూటమిలో టీడీపీ అయిదు, సీపీఐ ఒక స్థానం లో గెలిచే చాన్సు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇవన్నీ కలుపుకున్నప్పటికీ ఇంకో 28 స్థానాలలో అయినా కొత్తగా పట్టు సాధించాలి. టీఆర్ఎస్ కనీసంగా తాము లెక్కల్లో వేసుకున్న నియోజకవర్గాలను పక్కనపెడితే మరో 25 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని తెచ్చుకోవాలి. ఎంఐఎం తరఫున ఏడు సీట్ల మద్దతు దొరికినా ఇంకా మెజార్టీకి 18 సీట్లలో బలాన్ని పెంచుకోవాలి. రానున్న పదిరోజులే ప్రజాకూటమి, టీఆర్ఎస్ ల అదృష్టానికి పరీక్ష పెట్టబోతున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News