పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

గత వారం రోజులు ఆంధ్రప్రదేశ్ లోని జనసేన పార్టీ శ్రేణులకు ఓ వార్త అస్సలు మింగుడు పడటం లేదు. ప్రముఖ సినీ నటుడు ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్ [more]

Update: 2019-01-05 11:00 GMT

గత వారం రోజులు ఆంధ్రప్రదేశ్ లోని జనసేన పార్టీ శ్రేణులకు ఓ వార్త అస్సలు మింగుడు పడటం లేదు. ప్రముఖ సినీ నటుడు ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ఆలీకి సుదీర్ఘ అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి వచ్చిన నాటి నుంచి ఆలీ ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇంచుమించు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్ని సినిమాల్లో ఆలీ కూడా మంచి పాత్రల్లోనే నటించారు. ఇక, కేవలం సినిమాల పరంగానే కాకుండా పవన్ తో వ్యక్తిగతంగానూ ఆలీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వపన్ కళ్యాణ్ తో పాట మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఆయన మెలిగారు. ఈ విషయాన్ని వివిధ సందర్భాల్లో ఆలీ వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, జనసేన పార్టీని స్థాపించినప్పుడు కూడా ఆలీ స్వాగతించారు. పవన్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఓ దశలో ఆలీ రానున్న ఎన్నికల్లో ఆయన స్వస్థలం రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం కూడా పెద్దఎత్తున జరిగింది.

పవన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు

ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని విధంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిసిన ఫోటో వారం రోజుల క్రితం ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది. జగన్ పక్కన కూర్చొని ఆయనతో ఆలీ సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు ఆ ఫోటో ఉంది. ఆలీ ఎయిర్ పోర్టులో జగన్ ను ప్రత్యేకంగా కలిసి రాజకీయ ప్రవేశంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో జరగనున్న జగన్ పాదయాత్ర ముగింపు సభలో ఆలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే తెలుస్తోంది. అయితే, ఆలీ మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక, ఆలీ వైసీపీలోకి చేరుతున్నారనే వార్తతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆలీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నేళ్లు పవన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా వైసీపీలోకి వెళుతున్నాడంటూ పెద్దఎత్తున విమర్శిస్తున్నారు.

రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆలీ

అయితే, ఆలీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నా ఆయన తెలుగుదేశం పార్టీకి కొంత అనుబంధంగా ఉండేవారు. గతంలో టీడీపీ తరపున ఆయన ప్రచారం కూడా చేశారు. కానీ, చాలా ఏళ్లుగా టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇండస్ట్రీతో పాటు స్వస్థలంలోనూ మంచి పేరు ఉన్న ఆలీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోవడం, అందుకు వైసీపీని ఎంచుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ముఖ్యంగా, ఓవైపు బీజేపీతో వైసీపీ కుమ్మక్కయ్యిందని టీడీపీ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో ముస్లిం వర్గానికి చెందిన ఆలీ వస్తే ఆ పార్టీకి ఎంతోకొంత బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. దీనికితోడు గతానికి భిన్నంగా వైసీపీకి సినీ ఇండస్ట్రీలోనూ మద్దతు పెరిగినట్లే భావించాలి. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణమురళి, పృధ్వీ, చోటా కే నాయుడు, కృష్ణుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, భానుచందర్ తదితరులు జగన్ ని కలిసి మద్దతు తెలిపారు. ఆలీ వైసీపీలో చేరితే గనక జనసేనను నైతికంగా దెబ్బతీయడంతో పాటు టీడీపీ చేస్తున్న ‘బీజేపీతో కుమ్మక్కు’ ప్రచారానికి కొంత చెక్ పెట్టడంతో పాటు పార్టీకి సినీ గ్లామర్ కూడా పెరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఆయన వైసీపీలో చేరుతారా లేదా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News