ఆ వైసీపీ ఎమ్మెల్యేకు ముందే తెలిసిపోయిందా ?

రాజకీయాల్లో ప్రజాసేవకులు ప్రజలకు బాధ్యులు. అంటే ఇక్కడ ప్రజలే ప్రభువులు. కానీ ఆ ప్రభువులు ఒకసారి ఉద్యోగం ఇస్తే అయిదేళ్ల పాటు సేవకుడిని ఏమీ చేయలేరు, తీసేయాలనుకున్నా [more]

Update: 2020-09-18 13:30 GMT

రాజకీయాల్లో ప్రజాసేవకులు ప్రజలకు బాధ్యులు. అంటే ఇక్కడ ప్రజలే ప్రభువులు. కానీ ఆ ప్రభువులు ఒకసారి ఉద్యోగం ఇస్తే అయిదేళ్ల పాటు సేవకుడిని ఏమీ చేయలేరు, తీసేయాలనుకున్నా కుదిరేది కాదు. దాంతో మంచి మాటలు చెప్పి అయిదేళ్ళ కొలువు సంపాదించిన వారు మధ్యలో అడ్డం తిరిగితే ఎంతటి ప్రభువు అయినా చేసేది ఏమీ లేదు. ఇపుడు రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఒకసారి ఎమ్మెల్యే అయిపోయాక జనం ముఖం చూపించేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గెలిచి ఏడాదిన్నర అయింది. కానీ జనాలతో పట్టింపు లేకుండా సొంత పనులు చూసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న్నాయి.

లక్కీ ఆయనదే….

నిజానికి అలజంగి జోగారావు చివరి నిముషంలో వైసీపీలో చేరారు. ఆయనకు టికెట్ ఇప్పించినది బొత్స సత్యనారాయణ అంటారు. అప్పటిదాక పార్టీ జెండా మోసి నానా కష్టాలూ పడిన జమ్మాన ప్రసన్నకుమార్ ని తప్పించి మరీ అలజంగి జోగారావు టికెట్ కొట్టేశారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం బాగా గట్టిగా వీచింది. దాంతో అలజంగి జోగారావు సులువుగా గెలిచారు. అలా లక్కీ ఎమ్మెల్యేగా ముద్రపడిన ఆయన నాటి నుంచి తాను ఇచ్చిన హామీలను మరచి సొంత రాజకీయానికి తెర తీశారని వైసీపీలోనే విమర్శలు వస్తున్నాయి. ఆయన సాటి పార్టీ నాయకులను కూడా ఖాతరు చేయడంలేదు అంటున్నారు.

అవీ ఆరోపణలు…..

ఇక నియోజకవర్గం అభివృధ్ధిని పక్కన పెట్టి భూదందారాయుళ్లకు, అవినీతిపరులకు కొమ్ము కాస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. తాను గెలిస్తే అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పిన అలజంగి జోగారావు ఇపుడు ముఖం చాటేయడం పట్ల జనంలోలోనూ ఆగ్రహం పెల్లుబుకుతోంది. మరో వైపు జమ్మాన ప్రసన్నకుమార్ వర్గాన్ని వైసీపీలో ఉండనీయకుండా చేస్తున్నారని అంటున్నారు. దీంతో వర్గ పోరు పార్టీలో పెరిగిపోతోంది. జమ్మానకు నామినేటెడ్ పదవి ఇస్తామని ఆశపెట్టి మరీ వంచించారని ఆయన వర్గం రగులుతోంది. ఎమ్మెల్యే వర్గం వారిని ఢీ కొంటూ పార్టీని వీధిన పడేస్తోందని అంటున్నారు.

అక్కడా గొడవలే…?

ఇక పక్కనే ఉన్న కురుపాం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితో కూడా అలజంగి జోగారావుకి అసలు పొసగడంలేదుట. ఆమెను కూడా ఖాతరు చేయకుండా పార్వతీపురంలో ఎమ్మెల్యే తన ఇష్టారీతిన రాజ్యం చేస్తున్నారని అంటున్నారు. బదిలీలు, ఇతర పైరవీలలో ఎమ్మెల్యే పేరు వినిపించడం గమనార్హం. ఇక ఎమ్మెల్యేకు ఇపుడు ఇంకో జడుపు జ్వరం పట్టుకుందిట. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ వైసీపీలోకి వస్తున్నాడు అన్న వార్తతో ఎమ్మెల్యే శిబిరంలో అలజడి రేగుతోందిట. గట్టి నాయకుడు అయిన జగదీష్ కనుక వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే తనకు కష్టమని కూడా అలజంగి జోగారావు వర్గీయులు తల్లడిల్లుతున్నారుట. ఇక ఆయన్ని రానీయకుండా పావులు కదుపుతున్నారని టాక్. ఇవన్నీ ఇలా ఉంటే సొంత పార్టీలో మంచి పేరు తెచ్చుకోకుండా జనానికీ జవాబుదారీ కాకుండా అలజంగి నేలను విడిచి చేస్తున్న రాజకీయ సాము అలజంగి జోగారావును వన్ టైం ఎమ్మెల్యేగా మార్చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News