టార్గెట్ అఖిలేష్….!!!

లోక్ సభ ఎన్నికల ముంగిట సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. సీబీఐ కేసు అఖిలేష్ మెడకు చుట్టుకునేలా ఉంది. [more]

Update: 2019-01-06 18:29 GMT

లోక్ సభ ఎన్నికల ముంగిట సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. సీబీఐ కేసు అఖిలేష్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తులపై నిర్ణయం తీసుకున్న తర్వాత సీబీఐ సోదాలు జరగడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు సిద్ధమయ్యాయి. అఖిలేష్ యాదవ్, మాయావతిలు చెరి 37 స్థానాలను తీసుకుని మిగిలిన ఆరు స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించాయి.

పొత్తు కుదిరిన వెంటనే…..

ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటలు గడవక ముందే సీబీఐ యూపీలో హల్ చల్ చేయడం విశేషం. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక కుంభకోణాన్ని సీబీఐ తవ్వి తీసింది. ఈ అక్రమాల్లో అఖిలేష్ యాదవ్ పాత్ర కూడా ఉందని సీబీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వందల కోట్ల రూపాయలు ఇసుక అక్రమ రవాణా ద్వారా అప్పటి అధికార పార్టీ అక్రమార్జన చేసిందన్నది అభియోగం. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి చంద్రకళ, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ కుమార్ మిశ్రా, బీఎస్పీ నేత సంజయ్ దీక్షిత్ లపై కేసు నమోదయింది.

ఇసుక అక్రమ రవాణాతో….

ఇసుక అక్రమరవాణా ద్వారా 2012 నుంచి 2016 మధ్య కాలంలో హమీర్ పూర్ జిల్లాలో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. 2012 నుంచి 2013 వరకూ గనుల శాఖను ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ తన వద్దనే ఉంచుకున్నారు. నిబందనలను పక్కన పెట్టి అక్రమంగా ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారన్న అభియోగంపై ఇప్పటికే ఐఏఎస్ చంద్రకళపై అభియోగాలు నమోదయ్యాయి.

సీబీఐ ప్రయోగం అందుకేనా?

ఎన్నికల వేళ బీఎస్పీ, ఎస్పీలను ఇరకాటంలో పెట్టేందుకు సీబీఐని ప్రయోగించిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో తమను దెబ్బతీయడానికే ఈ కేసులను తిరగదోడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ అభిప్రాయపడుతుంది. న్యాయపోరాటం చేసి నిజానిజాలను తాము బట్టబయలు చేస్తామని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం సీబీఐ కి అందిన ఆధారాల ప్రకారమే సోదాలు నిర్వహించిందని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందుగానే అఖిలేష్ మెడకు సీబీఐ ఉచ్చు బిగుసుకునేలా కన్పిస్తోంది.

Tags:    

Similar News