రాజీనా….? రణమా….??

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాజీ పడక తప్పేట్లు లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి కట్టాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు [more]

Update: 2018-12-31 17:30 GMT

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాజీ పడక తప్పేట్లు లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి కట్టాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు యూపీలోనే గండి పడేటట్లు ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు దాదాపు మృగ్యమయిపోయాయి. ఉత్తరప్రదేశ్ లో కేవలం ఎస్సీ, బీఎస్పీలు మాత్రమే కలసి పోటీ చేస్తాయి. కావాలంటే అమేధీ, రాయబరేలీ నియోజక వర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పోటీగా బరిలోకి దింపకూడదదని నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఎన్నికలకు ముందే….

అంతే తప్ప కాంగ్రెస్ ను నేరుగా కలుపుకుని కూటమి కట్టే ప్రయత్నాలు మాత్రం లేవనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలున్నాయి. ఇక్కడి విజయావకాశాలను బట్టే కేంద్రంలో ఎస్పీ, బీఎస్పీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిస్తే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని కావచ్చన్న యోచనలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ను పక్కనపెట్టి ఎస్సీ, బీఎస్పీలు కలసి ప్రయాణించాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చాయి.

అఖిలేష్ అసలు విషయాన్ని….

ఈ విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పకనే చెప్పారు. మధ్యప్రదేశ్ లో తమ ఎమ్మెల్యే కు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తమ నెత్తిన పాలు పోశారన్నారు. ఇక్కడ తమకు పెద్ద తలనొప్పి తప్పిందన్న ధోరణిలో ఆయన మాట్లాడటం చూస్తే కాంగ్రెస్ ను పక్కన పెట్టి పోటీ చేయాలని భావిస్తున్నాయి. జనవరి 15వ తేదీన మాయావతి పుట్టినరోజు. ఈ సందర్భంగా మాయావతి దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందంటున్నారు.

ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుంటే….

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టాలంటే ఉత్తరప్రదేశ్ లో రాజీ పడక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేతలు సయితం భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో రెండు సీట్లలో మాత్రమే పోటీ చేయడమంటే కాంగ్రెస్ కు పరువు పోయే వ్యవహారమే. అతి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ కనీస స్థానాల్లో పోటీ చేయకపోతే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల మీదా పడుతుంది. దీంతో రాజీ పడాలా? లేక రణంలోకి దిగాలా? అన్నది కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ వచ్చే ఎన్నికలకు ముందు బీజేపీ యేతర పార్టీల కూటమిని శాసిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Tags:    

Similar News