మళ్లీ బాబాయ్ చేరువవుతారా?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగనున్నాయి. ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ ఆ ఎన్నికలు సిద్ధమవుతున్నాయనే చెప్పాలి. ఈసారి పోటీ సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ [more]

Update: 2020-11-16 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగనున్నాయి. ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ ఆ ఎన్నికలు సిద్ధమవుతున్నాయనే చెప్పాలి. ఈసారి పోటీ సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ మధ్యనే ఉంటుందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఎటువంటి కూటములను ఏర్పాటు చేసే ఆలోచనలో పార్టీలు లేవు. కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలు ఈసారి విడిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికలకు వెళ్లినా ఫలితం లేదు. లోక్ సభఎన్నికలలో ఎస్పీ, బీఎస్పీలు కలసి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

అఖిలేష్ తో విభేదించి…..

ఈసారి ఎన్నికలకు సమాజ్ వాదీ పార్టీ సమాయత్తమవుతోంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా ములాయం కుటుంబంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే దిశగా యత్నాలు ప్రారంభమయ్యాయి. ములాయం సింగ్ సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ తో విభేదించి బయటకు వెళ్లిపోయారు. ఆయన సొంతంగా సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని పెట్టుకున్నారు.

ఒక్క స్థానం కూడా…..

గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసినా ఒక్క స్థానం కూడా సాధించలేదు. బీజేపీ వెనక ఉండి పోటీ చేయించిందన్న ఆరోపణలు అప్పట్లో విన్పించాయి. ములాయం సింగ్ స్వయంగా కుమారుడు, తమ్ముడికి మధ్య సయోధ్యకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. తన వర్గం వారిని అఖిలేష్ తొక్కేస్తున్నారని ఆరోపిస్తూ శివపాల్ యాదవ్ బయటకు వెళ్లిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి ఇద్దరూ ఒక్కటవుతారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

త్వరలోనే విలీనానికి……

అఖిలేష్ యాదవ్ స్వయంగా బాబాయ్ ను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీని సమాజ్ వాదీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను శివపాల్ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహంలో శివపాల్ యాదవ్ దిట్ట. కొన్ని నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది. దీంతో బాబాయ్ ని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. శివపాల్ యాదవ్ ఈ సందర్భంగా కొన్ని కండిషన్లు పెట్టే అవకాశముందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Tags:    

Similar News