యాదవ్ దే ఇక పై చేయి అట.. సైకిల్ స్పీడు మామూలుగా ఉండదట

ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మారుతోంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లో కొత్త ఆశలు చిగురించాయి. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను [more]

Update: 2021-05-19 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మారుతోంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లో కొత్త ఆశలు చిగురించాయి. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సంకేతమని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోనూ సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యత కనపర్చడం అఖిలేష్ యాదవ్ లో మరింత ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.

మరికొద్ది నెలల్లో….

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరగనున్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో విజయం సాధిస్తే ఢిల్లీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేవీలుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. కానీ రానురాను మోదీ ఇమేజ్ తగ్గడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి పెరుగుతుండటంతో అఖిలేష్ యాదవ్ తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ప్రజలు తమ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారని నమ్ముతున్నారు.

ఒంటరిగా పోటీ చేసి…

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోట ీచేస్తానని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఆయన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. మొత్తం 3,050 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ కేవలం 599 స్థానాలకే పరిమితమయింది. సమాజ్ వాదీ పార్టీ 790, బహుజన్ సమాజ్ పార్టీ 354, కాంగ్రెస్ 60 స్థానాల్లో విజయం సాధించాయి. పార్టీలకంటే స్వతంత్ర అభ్యర్థులు 1,247 స్థానాల్లో గెలవడం విశేషం.

పంచాయతీ ఎన్నికలు…..

దీంతో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ పెద్ద రాష్ట్రం కావడంతో ఇప్పటి నుంచే జిల్లాల పర్యటన చేపట్టాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపికను కసరత్తుతో పాటు కొన్ని చిన్న చితకా పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది అఖిలేష్ యాదవ్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల ఫలితాలు అఖిలేష్ యాదవ్ లో జోష్ నింపిందనే చెప్పాలి.

Tags:    

Similar News