Akhilesh : అంత క్లారిటీ వచ్చిందా?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా గెలుపు తమదేనన్న ధీమాలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఆయన ఒక ప్లాన్ ప్రకారం ముందుకు [more]

Update: 2021-10-15 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా గెలుపు తమదేనన్న ధీమాలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఆయన ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారు. జాతీయ పార్టీలతో కలసి ముందుకు సాగడానికి ఆయన ఇష్టపడటం లేదు. చిన్న పార్టీలతోనే ఆయన పొత్తులు పెట్టుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో దాదాపు యాభై వరకూ చిన్నా చితకా పార్టీలున్నాయి. కులాల పరంగా అవి కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతాయి.

చిన్న పార్టీలతో….

అందుకే అఖిలేష్ యాదవ్ చిన్న పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. వారికి పట్టున్న ప్రాంతాల్లోనే కొద్ది సీట్లను వారికి కేటాయించే అవకాశముంది. ఇక కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆయన దాదాపు ప్రతిరోజూ క్లారిటీ ఇస్తున్నారు. తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ తన ఓట్లను చీల్చే స్థాయిలో లేదన్న నమ్మకం కావచ్చు. బీజేపీకి తాను మాత్రమే ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనపడుతుండటం కావచ్చు.

నమ్మకం కలిగించే….

అఖిలేష్ యాదవ్ గత కొద్ది రోజులుగా రధయాత్ర చేస్తున్నారు. ఆయన యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ఒక పక్క రధయాత్ర చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూనే మరో వైపు చిన్న పార్టీలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పార్టీ నేతలకు కూడా ఈసారి అఖిలేష్ దే విజయం అన్న నమ్మకాన్ని కల్గించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పార్టీలను కలుపుకుని వెళితే తనదే ముఖ్యమంత్రి పీఠమని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు….

ప్రస్తుత పరిస్థిితిని చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యతిరేకతను ఎవరు సొమ్ము చేసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలితే అది బీజేపీకే లాభమవుతుంది. అలా ప్రభుత్వ వ్యతిరేక చీలకుండా ఉండాలనే తానే బీజేపీకి బలమైన పోటీ ఇచ్చేదన్న ప్రదర్శనను గత కొంతకాలంగా అఖిలేష్ యాదవ్ నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అఖిలేష్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News