అఖిలేష్ లైన్లోకి వచ్చారే

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లో రాజకీయ వేడి చల్లారలేదు. నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో [more]

Update: 2019-09-17 16:30 GMT

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లో రాజకీయ వేడి చల్లారలేదు. నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. జమిలి ఎన్నికలు వస్తే తప్ప ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. 2022లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. అయినా సరే అక్కడ రాజకీయం ఇప్పటి నుంచే హీటెక్కింది. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు బలంగా ఉండేవి. అయితే గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ ప్రాంతీయ పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది.

వ్యూహాల్లో లోపమే…..

ఉత్తర్ ప్రదేశ్ లో ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలదే ఆధిపత్యం. ములాయం సింగ్, మాయావతిలే మార్చి మార్చి అధికారం చేపట్టారు. అయితే ములాయం సింగ్ తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీ పగ్గాలను చేపట్టారు. 2012 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చతికల పడిపోయింది. అఖిలేష్ యాదవ్ వ్యూహాల్లో లోపాలే పరాజయాలకు కారణమని చెప్పక తప్పదు. ఆయన తప్పటడుగులే పార్టీని అట్టడుగు స్థాయికి చేర్చాయన్న వాదన కూడా లేకపోలేదు.

మాయావతి ఇప్పటికే…..

పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లాయి. కాని ఫలితం దక్కలేదు. పార్లమెంటు ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను పక్కన పెట్టి తన దీర్ఘకాల శత్రువైన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో చేతులు కలిపారు. ఎస్సీ, బీఎస్పీ లు కలసి పోటీ చేసినా గెలుపు దరి చేరలేదు. పైగా రెండు పార్టీలకు చెందిన ఓట్లు ఒకరికి మరొకరికి బదిలీ కాలేదు. దీంతో మాయావతి ఇక ఎస్పీతో పొత్తు ఉండదని చెప్పేశారు.

పొత్తు ఉండదని…..

ఇక తాజాగా అఖిలేష్ యాదవ్ కు కూడా పొత్తులపై స్పందించారు. తాము భవిష్యత్తులో ఏపార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. పొత్తుల కారణంగా తమకు అనేక ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురయిందని ఆయన అంగీకరించారు. ఇకపై ఉత్తర్ ప్రదేశ్ లో ఏ ఎన్నిక జరిగినా సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అంటే ఇక బీఎస్పీ, కాంగ్రెస్ తో పొత్తు ఉండదని అఖిలేష్ యాదవ్ చెప్పేశారు. ఇది బీజేపీకి లాభదాయకమేనని అంటున్నారు. చతుర్ముఖపోటీ జరిగితే అది కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News