మామ కోసమేనా? ఈ పాట్లు తల్లీ?

మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీలో ఇప్పుడు బిగ్ వాయిస్ గా మారిపోయారు. నిన్న మొన్నటి వరకూ ఓటమి బాధతో ఉన్న అఖిలప్రియ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో [more]

Update: 2020-05-05 13:30 GMT

మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీలో ఇప్పుడు బిగ్ వాయిస్ గా మారిపోయారు. నిన్న మొన్నటి వరకూ ఓటమి బాధతో ఉన్న అఖిలప్రియ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో స్పీడ్ పెంచారు. అయితే ఆళ్లగడ్డ, నంద్యాలలోనే అఖిలప్రియ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అక్కడే తిరుగుతున్నారు. ఆళ్లగడ్డలో తిరిగి తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు నంద్యాలలో కూడా తమ కుటుంబానికి ఉన్న క్యాడర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కర్నూలు టార్గెట్….

ఇంతవరకూ బాగానే ఉన్నా అఖిలప్రియ ఇప్పుడు టార్గెట్ కర్నూలు అయింది. అంది వచ్చిన అవకాశాన్ని అఖిలప్రియ ఉపయోగించుకుంటున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై అఖిలప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి హఫీజ్ ఖాన్ కారణమంటూ అఖిలప్రియ ధ్వజమెత్తారు. ఆయన క్వారంటైన్ కు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పనిలో పనిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై కూడా అఖిల ప్రియ విమర్శలు చేసినా ఎక్కువగా కర్నూలుపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశమైంది.

సంబంధం లేకపోయినా….

నిజానికి అఖిలప్రియకు కర్నూలుతో సంబంధం లేదు. మాజీ మంత్రిగా మాట్లాడే బాధ్యత తనకు ఉందని చెబుతున్నా, లోలోపల మాత్రం మామపై అభిమానమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అఖిలప్రియకు సొంత మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి. ఆయన కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి భూమా కుటుంబంతో కలసి టీడీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో టిక్కెట్ దొరకకపోవడంతో ఎన్నికలకు ముందు ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. అఖిలప్రియ టీడీపీలో ఉన్నా ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం వైసీపీలో కొనసాగుతున్నారు.

ఎస్వీ వర్సెస్ హఫీజ్ ఖాన్….

కర్నూలు నియోజకవర్గంలో ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు మధ్య పొసగడం లేదు. ఇద్దరూ హైకమాండ్ కు ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని హఫీజ్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హఫీజ్ ఖాన్ ను అఖిలప్రియ టార్గెట్ చేయడం కూడా మామ ఎస్వీ మోహన రెడ్డి కోసమేనన్న ప్రచారం జరుగుతోంది. మామకు శత్రువుగా ఉన్న హఫీజ్ ఖాన్ పై టీడీపీ తరుపున విమర్శలు చేస్తే ఎంతో కొంత ఎస్వీకి లాభించకపోతుందా? అన్నది అఖిలప్రియ అంచనా. మొత్తం మీద హఫీజ్ ఖాన్ తప్పులేకపోయినా, తనకు సంబంధం లేని చోట అఖిలప్రియ వేలు పెడుతుండటం మామ కోసమేనన్నది జిల్లాలో బలంగా విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News