వ్యవ‘సాయం’దండగే…?

రైతుభరోసా, రైతుబంధు, పీఎం కిసాన్ యోజన ..పేరు ఏదైనా ప్రభుత్వాలు తాము రైతాంగానికి ఎంతో చేస్తున్నామని చెప్పుకునే పేరు గొప్ప పథకాలు ఇవి. కుడిచేతితో విదిల్చి ఎడమచేతితో [more]

Update: 2021-04-10 16:30 GMT

రైతుభరోసా, రైతుబంధు, పీఎం కిసాన్ యోజన ..పేరు ఏదైనా ప్రభుత్వాలు తాము రైతాంగానికి ఎంతో చేస్తున్నామని చెప్పుకునే పేరు గొప్ప పథకాలు ఇవి. కుడిచేతితో విదిల్చి ఎడమచేతితో మొత్తం లాగేసుకుంటున్న కుహనా పన్నాగాలు. ఇప్పటికే వ్యవసాయం చేయాలంటే దండగమారి వ్యవహారంగా గ్రామాల్లో రైతులు బావిస్తున్నారు. వారసత్వంగా తమపిల్లలు వ్యవసాయంలోకి రావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. ఏమాత్రం ఆసరా దొరికినా పొలాలను వదిలి పట్టణాలకు వలస పోతున్నారు. పంటకు గిట్టుబాటు ధర రాదు. పనికి కూలీలు దొరకరు. తాజాగాఎరువుల ధరలు కొండెక్కుతున్నాయి. ఒక్కసారిగా ఎరువుల ధరలు 50 శాతం పెంచేందుకు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఖర్చులను రెట్టింపు చేసి చూపించేసింది. రకరకాల కారణాలు, సాకులు చూపుతూ కనీస మద్దతు ధరకు సైతం గండి కొట్టడమెలా? అని ఆలోచిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రంగాన్ని నిట్టనిలువుగా దోపిడి చేసేందుకు రంగం సిద్దమైపోతోంది. ఎరువుల ధరల రూపంలోనూ, ఇష్టారాజ్యంగా స్వేచ్చామార్కెట్ కు వదిలేయడంతోనూ తీవ్ర పరిణామాలు ఉత్పన్నం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో క్రాప్ హాలిడేలు పెరిగిపోవచ్చంటున్నారు. రైతులు స్వచ్చందంగా సాగుకు వీడ్కోలు పలికే తరుణం ఉత్పన్నమవుతోంది. పొలాలను బీడులుగా అయినా వదిలేస్తాం తప్పితే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, గిట్టుబాటు రాక రుణ సంక్సోభంలో కూరుకుపోలేమని వాపోతున్నారు.

పెనం నుంచి పొయ్యిలోకి ..

ఏటా జాతీయాదాయంలో 12శాతం మేరకు వ్యవసాయ రంగం నుంచి భాగస్వామ్యం లభిస్తోంది. స్వాతంత్ర్యం తొలి నాళ్లలో ఇది 60శాతం పైగా ఉండేది. పరిశ్రమలు, సేవారంగం అప్పుడు అంతంతమాత్రమే. అందువల్ల ప్రజల జీవన ప్రమాణాలను వ్యవసాయరంగమే నిర్దేశించేది. క్రమేపీ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఇటీవలి కాలంలో మేజర్ షేర్ సేవారంగం నుంచి వస్తోంది. వ్యవసాయ రంగంపై ఆధారపడకుండా ఇతర రంగాల ద్వారా ఆదాయం రావడం హర్షించదగ్గ పరిణామమే. కానీ ఈ రంగం ఆహారోత్పత్తికి, దేశ స్వావలంబనకు ఆయువుపట్టు. అయినా దీని ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించడానికి నిరాకరిస్తోంది. మిగిలిన రంగాలు సంపద పెంచవచ్చు. కానీ అవి అలంకరణలే. వ్యవసాయం జీవన వనరు. అటువంటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో భారత స్వయంపోషకత్వం లోపిస్తుంది. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే ఆందోళన సాగుతోంది. తాజాగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఎరువుల తయారీకి చమురు ముడి పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ధరలు అనివార్యంగా పెరగకతప్పదు. ట్రాక్టర్ కదలాలన్నా డీజెల్ కావాలి. ఇంధన వనరుల ధరలు గడచిన ఆరేడు నెలలుగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా పెట్రోలు, డీజెల్ రూపంలో ప్రజల జేబులు కొల్లగొడుతున్నాయి. వ్యక్తిగతంగా ప్రజలు వీటిపై చేసే వ్యయాన్ని పక్కనపెడితే ధరల ప్రభావంతో రవాణా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతున్నాయి. రవాణా రంగం ప్రజలపై భారం మోపుతుంది. కానీ వ్యవసాయరంగం ఎవరిపై భారం మోపాలి. రైతులు తమ ఉత్పత్తుల ధరలను పెంచి విక్రయించుకోవడం సాధ్యమవుతుందా? కనీస మద్దతు ధరకే సవాలక్ష లెక్కలు తీసే ప్రభుత్వాలు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాయా?

కౌలుదారుల కన్నీళ్లు…

వ్యవసాయ రంగంలో సాగవుతున్న భూమిలో 40శాతం ఇప్పటికే కౌలుదారుల చేతిలో ఉంది. కొంచెం జీవన ప్రమాణాలు బాగున్న కుటుంబాలు పిల్లల చదువు, వ్యాపారాల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాల బాట పట్టారు. గడచిన 20 ఏళ్లుగా ఇది పెరుగుతూ వస్తోంది. అయితే గ్రామాల్లో తమ పొలాలను చుట్టుపక్కల వారికి కౌలుకు ఇచ్చేస్తున్నారు. వీటిపై రాతకోతలు ఉండవు. మరోవైపు పట్టణాల్లో సాఫ్ట్ వేర్, ఇతర స్థిర ఆదాయం కల ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులు చాలా మంది భూములు కొంటున్నారు. ఇదొక పెట్టుబడి సాధనంగా వారు చూస్తున్నారు. వారు సాగుదారులు కాదు. మళ్లీ కౌలుదారులకు సాగు కు అప్పగిస్తున్నారు. ఇందువల్ల భూముల విలువ పెరిగిపోతోంది. వాస్తవ ఉత్పత్తి ఆదాయంతో సంబంధం లేకుండా కోట్ల రూపాయలకు పొలాల విలువ చేరిపోతోంది. పంట ఆదాయం పెరగడం లేదు. రైతుభరోసాలు, రైతు బంధులు, కిసాన్ యోజనల ద్వారా ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం భూమి యజమానులైన వారి ఖాతాల్లోనే పడుతోంది. నిజానికి భూములను సాగు చేసేవారికి పైసా దక్కడం లేదు. దీంతో కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో ఎరువులపై సబ్సిడీలు ఉండేవి. దానివల్ల కౌలుదారులకు నేరుగా ప్రయోజనం లభించేది. ఇప్పుడు నగదు బదిలీ పథకాలతో భూయజమానులు సాగు చేయకుండానే ప్రయోజనం దక్కించుకుంటున్నారు.

ఉసురు తీసిన ఉపాధి..

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా తయారైంది ఉపాధి హామీ పథకం. గ్రామీణ కూలీలను ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకం పక్కదారి పట్టింది. వ్యవసాయ పనులు లేని రోజుల్లో కూలీలకు పని కల్పించేందుకు ఉద్దేశించిన స్కీమ్ ఇది. దీనివల్ల వ్యవసాయరంగంలో కూలీలు దొరకడం లేదు. సగటు కూలీ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. అలాగని ఉపాధీ హమీ పథకం ద్వారా గ్రామాల్లో సంపద సృష్టి జరగడం లేదు. మౌలిక వసతుల కల్పన చేయడం లేదు. కేవలం ఉత్తుత్తి పనులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అవినీతి కూడా రాజ్యం చేస్తోంది. మరోవైపు వ్యవసాయరంగానికి మానవ వనరులు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేయమని చాలాకాలంగా డీమాండ్ ఉంది. అయినా ఓట్ల రాజకీయంతో ప్రభుత్వాలు పట్టించుకో్వడం లేదు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత, నగదు సాయం కేవలం యజమానులకే చెందడం, కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర కు గండి .. ఇవన్నీ చూస్తుంటే సాగు చేయడానికి ఎవరూ ముందుకు రాని వాతావరణం తప్పదేమో అనిపిస్తోంది. ప్రభుత్వం సమగ్రం గా అద్యయనం చేసి దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోతే ఆహారసంక్షోభానికి అట్టే కాలం పట్టకపోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News