మంటలు రేగాయా…?

ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది అక్కడ ఉద్యమకారుల వైఖరి. కొత్త సర్కార్ జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఉన్న వాటికి అదనంగా [more]

Update: 2019-08-15 02:00 GMT

ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది అక్కడ ఉద్యమకారుల వైఖరి. కొత్త సర్కార్ జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఉన్న వాటికి అదనంగా మరో పన్నెడు జతచేస్తూ పాతిక వరకూ జిల్లాలను చేస్తామ‌ని జగన్ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. నిజంగా జగన్ అమలు చేయనున్న ఈ నూతన విధానం పాలనాపరంగా ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అపుడెపుడో అన్న నందమూరి మండల వ్యవస్థ తీసుకువచ్చారు. దాని ఫలితాలు ఇపుడు జనం బాగానే పొందుతున్నారు. అలాగే ఎపుడో దశాబ్దాల నాటి నాటి జిల్లాల కూర్పును కాలానికి అనుగుణంగా మార్పు చేసుకోవడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది జగన్ ఆలోచన విధానంగా ఉంది. అయితే ఈ విషయంలో ఇంకా ప్రభుత్వ పరంగా ఎలాటి కార్యాచరణ సిద్ధం కాకుండానే పలు జిల్లాల్లో మంటలు పుడుతున్నాయి.

కొత్త జిల్లాతో నష్టమేనట……

ఉత్తరాంధ్ర జిల్లాలు సహజంగా బాగా వెనకబడినవి. అందులో బాగా దారుణంగా వెనకబడినది అనుకుంటే అది శ్రీకాకుళం అని చెప్పాలి. అక్కడే జిల్లా కేంద్రం చూస్తే చికాకు అనిపిస్తుంది. రోడ్లమీద పందులు కుక్కలు తిరుగుతూంటాయి. కలెక్టర్ ఆఫీస్ సైతం సరిగ్గా ఉండదు, రోడ్లు ఇరుకుగా మురికిగా ఉంటాయి. ఘనత వహించిన పెద్దలంతా పాలించినా కూడా శ్రీకాకుళం జిల్లాను ఇంచి కూడా మార్చలేకపోయారు. ఈ నేపధ్యంలో ఎంతో పోరాడితే జిల్లాలో కొన్ని పరిశ్రమలు, వర్శిటీలు వచ్చాయి. స్థలాభావం వల్ల అవన్నీ ఎచ్చెర్ల ప్రాంతంలోనే వరసగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే అంబేద్కర్ వర్శిటీ, అలాగే పైడిభీమవరంలో ఎక్కువగా పరిశ్రమలు వచ్చాయి. దాంతో పాటు అక్కడే మరిన్ని అభివ్రుధ్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం రంగం సిధ్ధం చేసింది. ఇపుడు ఈ అభివ్రుధ్ధి అంతా వేరే జిల్లాలో కలుస్తుందట. అంటే ఎచ్చెర్ల తదితర ప్రాంతాలన్నీ కూడా విజయనగరం జిల్లాలో కలుస్తాయన్నమాట. ఇదే ఇపుడు సిక్కోలు ఉద్యమకారులకు మంటపుట్టిస్తోంది. ఇదేంటి కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఉన్న అభివృధ్ధి కూడా వూడ్చిపెట్టాలా అని అపుడే గొంతు పెద్దది చేస్తున్నారు. ఉద్యమాలకు కూడా రెడీ అంటున్నారు.

అరకు కేంద్రంగా జిల్లా వద్దు….

ఇక అరకు కేంద్రంగా గిరిజన జిల్లాను జగన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇపుడు అది కూడా వేడి రాజేస్తోంది. పెడితే పార్వతీపురం కేంద్రంగా జిల్లాను పెట్టాలి తప్ప ఎక్కడో మూలన ఉన్న అరకుని జిల్లా కేంద్రం చేయడమేంటని అక్కడి జనాలు కస్సుమంటున్నారు. దీనికి రాజకీయం కూడా తోడు కావడంతో ఇక్కడ కూడా జిల్లా గోడవ పెరిగే ప్రమాదం ఉంది. ఇక అనకాపల్లిని జిల్లా కేంద్రం చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ చెబుతూంటే అదే పార్టీకి చెందిన నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ నర్శీపట్నం కేంద్రంగా జిల్లా కావాలని కోరుతున్నారు. మొత్తానికి కొత్త జిల్లాల ప్రకటన కాదు కానీ అపుడే రచ్చ రచ్చ అవుతోంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News