మొత్తానికి వీరు జాక్ పాట్ కొట్టేశారా… ?

సుదీర్ఘ నిరీక్షణ కూడా ఒక్కోసారి అద్భుతమైన వరాలను ఇస్తుంది. ఆదరించేవారు ఉండాలి కానీ కడపటి పంక్తి అయినా విందు భోజనమే దొరుకుతుంది. ఇపుడు వైసీపీలో దురదృష్టవంతులు అంటూ [more]

Update: 2021-06-16 00:30 GMT

సుదీర్ఘ నిరీక్షణ కూడా ఒక్కోసారి అద్భుతమైన వరాలను ఇస్తుంది. ఆదరించేవారు ఉండాలి కానీ కడపటి పంక్తి అయినా విందు భోజనమే దొరుకుతుంది. ఇపుడు వైసీపీలో దురదృష్టవంతులు అంటూ అంతా సెటైర్లు వేసిన వారి జాతకాన్ని ఒక్కసారి గిర్రున న తిప్పే పనిలో జగన్ ఉన్నారుట. వారికి కూడా మంచి అవకాశాలు ఇచ్చి తానున్నాను అనిపించుకుంటారుట. వైసీపీకి ఇపుడు చేతినిండా పదవులు ఉన్నాయి. అలాగే ఆశావహులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ జగన్ దగ్గర ఉన్న లిస్ట్ లోని వారికే బెర్తులు ఖాయమని అంటున్నారు.

ఎమ్మెల్సీ వంశీ …

ఆయన ఎమ్మెల్యే అవుదామనుకున్నారు. దాని కోసం ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకుని పన్నెండేళ్ల పాటు సుదీర్ఘ పోరాటమే చేశారు. కానీ అది అందని పండే అయింది. ఇక విశాఖ మేయర్ ఖాయమనుకున్న వేళ అది కూడా చివరి నిముషంలో జారిపోయింది. మొత్తానికి పార్టీని జగన్ని నమ్ముకుని పనిచేసుకుంటూ వస్తున్న విశాఖ నగర వైసీపీ ప్రెసిడెంట్ వంశీక్రిష్ణ యాదవ్ కి జగన్ అభయం ఇచ్చారు. నీకు నేనున్నాను అంటూ గట్టి భరోసావే ఇచ్చారు. ఇపుడు ఇచ్చిన మాట ప్రకారం వంశీకి ఎమ్మెల్సీ పదవి కంఫర్మ్ చేశారు అంటున్నారు. ఆలస్యం అయినా కూడా ఆరేళ్ళ పాటు హాయిగా పెద్దల సభలో కొలువుతీరే చక్కని పదవి వంశీకి దక్కుతోందని ఆయన అనుచరులు సంబరాలే చేసుకుంటున్నారు.

వీరి కధ సుఖాంతమే…?

ఇక గుంటూరు జిల్లాలో ఉన్న మరో ఇద్దరు నేతల కధ కూడా సుఖాంతం అవుతోంది అంటున్నారు. వారిలో ఒకరు లేళ్ళ అప్పిరెడ్డి. ఆయన పార్టీ కోసమే పనిచేస్తూ పదవి అన్న ఊసు కూడా తెలియకుండా కాలాన్ని కొలుస్తున్నారు. ఆయన జగన్ కి వీర విధేయుడుగా ఉన్నారు. అలాగే చిలకలూరిపేట నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మర్రి రాజశేఖర్ కి 2019 ఎన్నికల వేళ ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ చెప్పారు. అలాగే మంత్రిని చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇపుడు ఆయనకు కూడా మంచి రోజులు వచ్చేశాయట. ఈ ఇద్దరూ కూడా ఎమ్మెల్సీలు అవడం ఖాయమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నారు.

అదే సందేశం…

తనను నమ్మి వెంట నడచిన వారికి ఎప్పటికీ అన్యాయం జరగదు అన్నదే జగన్ ఇచ్చే సందేశం అంటున్నారు. ఒక రోజు అటూ ఇటూ అయినా పదవి మాత్రం ఖాయమని కూడా చెబుతున్నారు. తాను అందరినీ పట్టించుకుంటానని టైమ్ వచ్చినపుడు తానే వారికి పదవులు ఇస్తానని జగన్ చెబుతున్నారు. పెద్దల సభలో లోకల్ బాడీ కోటాలో 11, గవర్నర్ కోటాలో నాలుగు, ఎమ్మెల్యేల కోటాలో మూడు పదవులు తొందరలో ఖాళీ అవుతున్నాయి. ఈసారి ఇచ్చే పదవులు అన్నీ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికీ, వీర విధేయులకే కేటాయించాలి అన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. దాంతో ఏళ్ళ కొద్దీ బ్యాడ్ లక్ ని నెత్తిన మోస్తున్న చాలా మంది వైసీపీ నేతలకు ఈ తడవ రాజయోగం పట్టనుంది అంటున్నారు.

Tags:    

Similar News