ఈయన పూర్తిగా పడుకోబెట్టేస్తారా?

అన్నాడీఎంకే అధికారంలో పదేళ్ల పాటు ఉంది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత వెల్లవెత్తుతుంది. జయలలిత లాంటి నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీకి లేదు. నాయకత్వ లేమితోనే ఆ పార్టీ [more]

Update: 2021-01-15 18:29 GMT

అన్నాడీఎంకే అధికారంలో పదేళ్ల పాటు ఉంది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత వెల్లవెత్తుతుంది. జయలలిత లాంటి నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీకి లేదు. నాయకత్వ లేమితోనే ఆ పార్టీ ముందుకు వెళ్లాలి. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నప్పటకీ వారిద్దరూ కొన్ని ప్రాంతాలకే పరిమితం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగిన నేతలు ఇద్దరూ కాదు. మరోవైపు కమల్ హాసన్ సొంత పార్టీతో ముందుకు వస్తున్నారు. దినకరన్ పార్టీ కూడా శశికళను ముందు పెట్టి ఎన్నికల బరిలోకి దిగనుంది.

ఓటు బ్యాంకు….

తెలివైన పార్టీ అయితే ఏం చేయాలి. ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ఉండేలా కాపాడుకోవాలి. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత విజయకాంత్ కు లెక్కకు మించి అభిమానులున్నారు. అదృష్టవశాత్తూ విజయకాంత్ కు చెందిన డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలోనే ఉంది. అయితే ఆ పార్టీని కూడా దూరం చేసుకునే పనిలో పడ్డారు పళినిస్వామి, పన్నీర్ సెల్వం. విజయ్ కాంత్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు ఈ ఇద్దరు సుముఖంగా లేరు.

కూటమిలో కొనసాగడంపై….

దీంతో విజయకాంత్ కూటమిలో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అన్నాడీఎంకే తాము కోరుకున్న స్థానాలు ఇవ్వకుంటే బయటకు వెళ్లాలని విజయకాంత్ ఆల్ రెడీ డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో డీఎండీకే తృతీయ కూటమిలో ఉంది. నాడు విజయ్ కాంత్ ను ఆ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఇప్పుడు అన్నాడీఎంకే పళనిస్వామినే మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

ఆయన దూరమైతే….?

విజయకాంత్ కు తమిళనాడు వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన కీలకమైన కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. అన్నాడీఎంకే అసలే బలహీనంగా ఉంది. ఈ పరిస్థితుల్లో విజయ్ కాంత్ ను కూడా దూరం చేసుకుంటే వచ్చే కొన్ని సీట్లు కూడా దక్కవన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. విజయకాంత్ ఇప్పటికే ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. అదే జరిగితే పళనిస్వామికి ఉన్న కొద్ది అవకాశాలు లేనట్లేనని చెప్పాలి.

Tags:    

Similar News