ఆఫ్టర్ రిజల్ట్…. నో.. ఆపరేషన్….!!!

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ సర్కార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయని చెప్పనవసరం లేదు. ఇప్పటీకే సంకీర్ణ సర్కార్ పనితీరు పట్ల [more]

Update: 2019-04-16 17:30 GMT

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ సర్కార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయని చెప్పనవసరం లేదు. ఇప్పటీకే సంకీర్ణ సర్కార్ పనితీరు పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఏ నిర్ణయమూ ధైర్యంగా తీసుకోలేని పరిస్థితి ముఖ్యమంత్రి కుమారస్వామిది. అలాగని కుమారస్వామికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఎప్పటికప్పుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముకుతాడు వేస్తూనే ఉన్నారు.

ఎన్నికలకు ముందే లొసుగులు…..

లోక్ సభ ఎన్నికలకు ముందే సంకీర్ణ సర్కార్ లో లొసుగులు బయటపడ్డాయి. అసంతృప్తులు ఎక్కువయ్యారు. మలి విడత మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఇటు కాంగ్రెస్ అధిష్టానం, అటు కుమారస్వామిపై అనేక మంది గుర్రుగా ఉన్నారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని ప్రచారం జరిగినా ఆ ప్రమాదం నుంచి సంకీర్ణ సర్కార్ బయటపడింది. ఈలోపు లోక్ సభ ఎన్నికలు రావడంతో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కమల్ కు విరామమిచ్చింది.

సఖ్యత కొరవడి….

ఇక లోక్ సభ ఎన్నికల వేళ సంకీర్ణంలో ఉన్న జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య సీట్ల పంపకం నుంచే విభేదాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మాండ్య, తుముకూరు నియోజకవర్గాలను జనతాదళ్ ఎస్ కు ఇవ్వడాన్ని కాంగ్రెస్ లోని అనేకమంది నేతలు బహిరంగంగానే తప్పు పట్టారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర తుముకూరును జేడీఎస్ కు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పుడు తుముకూరు, మాండ్య, హాసన్, మైసూరు వంటి నియోజకవర్గాల్లలో కాంగ్రెస్ శ్రేణులు జనతాదళ్ ఎస్ తో కలసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నారు.

ఫలితాలను బట్టి…..

లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే, కేంద్రంలో మరోసారి మోదీ ప్రధాని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం కుప్ప కూలుతుందన్న ప్రచారం కర్ణాటకలో ఊపందుకుంది. ఫలితాలను బట్టి గోడ దూకేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ఉన్న అసంతృప్తి జేడీఎస్ ఎమ్మెల్యేలకు పాకింది. దీంతో లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పిడి జరుగుతుందన్న ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు జేడీఎస్, కాంగ్రెస్ లు ఫలితాల అనంతరం ఏ రకమైన వ్యూహాలన అనుసరిస్తాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News