కేటీఆర్ వర్గానికి కళ్లెం పడినట్లేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అంతు పట్టరు. ఆయన ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో? ఎవరిని ద్వేషిస్తారో ఎవరికీ తెలియదు. అందుకే కేసీఆర్ తో ఆచితూచి ఎవరైనా వ్యవహరిస్తారు. [more]

Update: 2021-02-24 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అంతు పట్టరు. ఆయన ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో? ఎవరిని ద్వేషిస్తారో ఎవరికీ తెలియదు. అందుకే కేసీఆర్ తో ఆచితూచి ఎవరైనా వ్యవహరిస్తారు. చివరకు తన కుమారుడు కేటీఆర్ విషయంలోనూ కేసీఆర్ కఠినంగానే ఉన్నారా? ఉండదలచుకున్నారా? కేటీఆర్ వర్గంగా ముద్రపడిన వారిని పక్కన పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? వారికి చెక్ పెట్టాలనే భావించారా? అంటే గులాబీ పార్టీలు అవుననే అంటున్నాయి.

అంతా తానే అయి…

కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ అంతా తానే అయి చూసుకుంటున్నారు. రెండోదఫా అధికారంలోకి వచ్చాక కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఇక కేటీఆర్ పేరుకే మంత్రి గాని, అన్ని శాఖల సమీక్షలు ఆయన నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా పర్యటనలు సయితం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో చేస్తున్నారు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం జోరుగా సాగింది.

ఆశలపై నీళ్లు తాత్కాలికమేనా?

టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సయితం కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షించారు. అయితే వారి అత్యుత్సాహంపై కేసీఆర్ నీళ్లు చల్లారు. తాను పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పి ఆ ప్రచారానికి తెరదించారు. ఇది తాత్కాలికం కావచ్చు. చెప్పలేం. త్వరలో సాగర్ ఉప ఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టి ఉండవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కేటీఆర్ గ్రూప్ కు కళ్లెం వేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.

ముఖ్యమైన పదవులు…..

ఇటీవల జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కేటీఆర్ వర్గాన్ని కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టారంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను తన భుజాన వేసుకుని నడిపించిన కేటీఆర్ కొన్ని పేర్లు సూచించినా వాటిని కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. తనకు అత్యంత దగ్గరయిన కేకేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా ఉద్యమకాలం నుంచి తనతో ప్రయాణిస్తున్న మోతే శోభన్ రెడ్డి సతీమణికి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. కేటీఆర్ వర్గంపై కేసీఆర్ గుర్రు తాత్కాలికమే కావచ్చు కాని ఈ చర్చ మాత్రం పార్టీలో జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News