అద్వానీ ఎందుకలా..?

భారతీయ జనతాపార్టీ అగ్రనేత అద్వానీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల హడావిడి, ప్రచారం పతాకస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆయన మనోభావం రాజకీయ దుమారం రేపుతోంది. [more]

Update: 2019-04-05 16:30 GMT

భారతీయ జనతాపార్టీ అగ్రనేత అద్వానీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల హడావిడి, ప్రచారం పతాకస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆయన మనోభావం రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని సందర్భంగా చేసుకుంటూ ఆచితూచి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పైకి చూస్తే ధర్మోపన్యాసంగా , సందేశంగా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నొక్కిచెబుతున్నట్లుగా కనిపిస్తాయి. కానీ లోతుల్లోకి తొంగిచూస్తే ఆయనలో గూడుకట్టుకున్న ఆవేదన ఆవిష్క్రుతమవుతోంది. ప్రత్యర్థులను శత్రువులుగా చూసే సంస్క్రుతి బీజేపీకి లేదన్న ఆయన మాట ఇప్పుడున్న పరిస్థితులకు వర్తిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. తమ సొంత పార్టీ అగ్రనాయకత్వం ఆ విధానానికి కట్టుబడి లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారనేది విమర్శకుల వాదన. అందుకే మోడీ, షా లను ఉద్దేశించే అద్వానీ బ్లాగులో రాశారనే వారి సంఖ్య పెరుగుతోంది. తమ తీరును మార్చుకోవాల్సిన అవసరాన్ని వారికి నొక్కి చెప్పారని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఆయన సందేశం బీజేపీ అగ్రనాయకత్వానికి కంటగింపుగా విపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా మారిందనే చెప్పాలి.

అవ్యవస్థ చూడలేకనే…

అద్వానీ వంటి పెద్దలను పక్కన పెట్టేసిన మాట వాస్తవం. పార్టీ వ్యవస్థాపన నుంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులో అద్వానీ కీలకనేతగా వ్యవహరిస్తూ వచ్చారు. దానినుంచి ఆయనను తప్పించి మార్గదర్శక మండలి పేరిట నిర్ణయాత్మకం కానీ ఒక సూచనాత్మక కమిటీకి పరిమితం చేసేశారు. ఆరుసార్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ స్థానం నుంచి ఈసారి తప్పించేశారు. ఇదంతా అవమానకరంగానే చెప్పుకోవాలి. ప్రధాని పదవి సాధ్యం కాని నేపథ్యంలో కనీసం రాష్ట్రపతి వంటి ఉన్నత హోదాతో అద్వానీని గౌరవించి ఉండాల్సిందని పార్టీ పరంగా పాతతరం నేతల్లో అసంత్రుప్తి ఉంది. స్వయంగా అద్వానీకి కూడా అటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ చెప్పుకోలేరు. కానీ దేశంలో ప్రజాస్వామికంగా ఉండాల్సిన రాజ్యాంగబద్ధ వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్న తీరును మాత్రం సహించలేకపోయారనేది ఆయన సన్నిహితుల వాదన. ఎన్నికల సంఘం మొదలు రిజర్వు బ్యాంకు వరకూ అన్నిటిపైనా నియంత్రుత్వాధికారాలు చెలాయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. న్యాయవ్యవస్థలోనూ జోక్యం చేసుకుంటోంది. ఇతర పార్టీలు మనుగడ సాగించలేని స్థితికి తేవాలని యత్నిస్తోంది. ఈ దశలో తన అభిప్రాయాలను చెప్పడం అవసరమని భావించి అగ్రనాయకత్వానికి చురకలు వేసేందుకే ఆయన తన మనసులోని మాటలను బయటపెట్టారనేది పార్టీలో ఒక వర్గం అభిప్రాయం.

అంతర్గత అణచివేత…

భిన్నాభిప్రాయాలను సహించే పరిస్థితి నానాటికీ పార్టీలో క్షీణిస్తోంది. వాజపేయి, అద్వానీల తర్వాత తరం నాయకులుగా వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ ఒకప్పుడు గుర్తింపు పొందారు. దేశంలోని పార్టీ శ్రేణులతో, రాష్ట్రస్థాయి నాయకులతో మంచి పరిచయాలున్న వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి పదవి పేరిట రాజకీయాలకు దూరంగా పెట్టేశారు. సుష్మాస్వరాజ్ ను కీలక ప్రకటనలకు సైతం దూరంగా ఉంచేశారు. అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ లను వివిధ కారణాలు, సాకులతో ప్రాముఖ్యం లేకుండా చేసేశారు. ఇక ఇప్పుడున్నదంతా మోడీ, షా శకమే. యోగి ఆదిత్యనాథ్ వంటివారు కొంతమేరకు ప్రత్యామ్నాయ నాయకత్వంగా పైకి వస్తారని భావించినప్పటికీ స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ అవకాశమూ కరవై పోయింది. పార్టీలో అమలవుతున్న నియంత్రుత్వ విధానాలపై నోరెత్తిన వారిని ఏదోరకంగా పక్కన పెట్టేస్తున్నారు. మిత్రపక్షాలను దూరం చేసుకుంటే భవిష్యత్తులో సంకీర్ణానికి ఇబ్బందికరమవుతుందని కొంతమేరకు వాటితో సఖ్యతతో మెలిగేందుకు మోడీ, షాలు ప్రయత్నిస్తున్నారు. వాటితో అవసరమైతే రాజీపడేందుకు సిద్ధమవుతున్నారు. పొత్తు విషయంలోఒక మెట్టు దిగుతున్నారు. కానీ పార్టీలోని నాయకులకు మాత్రం ఆ పాటి గౌరవం ఇవ్వడం లేదు. అంతర్గతంగా తీవ్రమైన అణచివేత కొనసాగుతోందని పార్టీలోని పెద్దనాయకులే వాపోవడం ప్రస్తుత బీజేపీ పరిస్థితికి అద్దం పడుతోంది.

సిద్ధాంతానికి చిల్లు…

మోడీ, అమిత్ షా లు అశేషమైన పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొంటున్నారు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఆదరణనూ పొందగలుగుతున్నారు. విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘ్ అనుబంధ సంఘాల ప్రేమకూ పాత్రులవుతున్నారు. దీంతో వారి మాటకు ఎదురులేకుండా పోతోంది. నిజానికి సంఘ్ సంస్థలు కోరుకునే హిందూవాదాన్ని దేశంలో బలోపేతం చేయడంలో మోడీ, షాలు బాగానే క్రుషి చేస్తున్నారు. కానీ భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక సిద్ధాంతం అది కాదు. వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు పార్టీ వ్యవస్థాపనలో కీలక భూమిక పోషించారు. పార్టీకి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వారే. వాజపేయి మరణించారు. మురళీ మనోహర్ జోషి వాజపేయి, అద్వానీల స్థాయికి చేరుకోలే్కపోయారు. అందువల్లనే అద్వానీ మరోసారి మూలసిద్దాంతాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది. అడాప్టివ్ హిందూయిజం ద్వారా ప్రజల్లోకి క్రమేపీ చొచ్చుకుపోతూ పార్టీ స్థిరపడాలనేది వ్యవస్థాపన నాటి ఆశయం. మోడీ, షాలు దీనికి కొత్త నిర్వచనం ఇచ్చారు. నూతన పంథాను నిర్దేశించారు. అగ్రెసివ్ హిందూయిజం వారి ధోరణిగా మారింది. దీనివల్ల పార్టీ చాలా వేగంగా, అనూహ్యంగా విస్తరించింది. ప్రాంతీయపార్టీలు, చిన్నాచితక మతవాద సంస్థలు ఈ వేగానికి కొట్టుకుపోతున్నాయి. సంఘ్ శక్తులకు ఇది బాగా నచ్చింది. అందువల్లనే వారికి పార్టీపరంగా బలమైన మద్దతు లభిస్తోంది. అద్వానీ వంటి వారి వాయిస్ పేలవంగా మారిపోతోంది. అద్వానీ తన బ్లాగులో రాసుకున్నంత మాత్రాన పెద్దగా మార్పేమీ రాకపోవచ్చు. కానీ రాజకీయాల్లో భారీ చర్చకు మాత్రం దారి తీస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News