రాజుగారి కుమార్తెకు ఆ రెండూ క‌లిసొచ్చాయ‌ట‌..!

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు రాజ‌కీయం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆయ‌న దూకుడు రాజ‌కీయాలు చేయ‌డంలో [more]

Update: 2020-05-12 12:30 GMT

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు రాజ‌కీయం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆయ‌న దూకుడు రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట. అంతేకాదు, పాలిటిక్స్‌లో ఆయ‌న భావ‌జాల‌మే డిఫ‌రెంట్‌. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడుగా మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేశారు. 2014లో ఎంపీగా విజ‌యం సాధించి.. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కూడా పొందారు. ఇక‌, ఆయ‌నకు వార‌సురాలిగా గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న కుమార్తె అదితి గ‌జ‌ప‌తి రాజు పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేసిన ఆమె గెలుపు గుర్రం ఎక్కడంపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, వైసీపీ సునామీ నేప‌థ్యంలో సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబంలో తండ్రీ కుమార్తెలు ఇద్దరూ ఓట‌మి పాల‌య్యారు.

కష్టపడుతున్నా….

దీంతో రాజుగారు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఎన్నిక‌ల అనంత‌రం చాన్నాళ్లు ఆరోగ్య స‌మ‌స్యతో ఢిల్లీలోనే ఉండిపోయిన రాజుగారు దాదాపు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల‌ను ప‌ట్టించుకోలేదు. వాస్తవానికి విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటు అశోక్ ఫ్యామిలీకి కంచుకోట‌. అయితే ఈ ఎన్నిక‌ల్లో త‌ండ్రి, కూతుళ్లు ఇద్దరూ పోటీ చేయ‌డంతో లోక్‌స‌భ‌కు అశోక్‌కు మెజార్టీ వ‌చ్చినా అసెంబ్లీకి మాత్రం అదితి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక అశోక్ ప్రజ‌ల్లోకి రార‌న్న అభిప్రాయం ఉంది. అయితే, ఆయ‌న కుమార్తె అదితి మాత్రం క‌ష్టప‌డుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

టీడీపీలోని ఒక వర్గమే….

నిజానికి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీలోనే ఓ వ‌ర్గం అదితికి యాంటీగా ప‌నిచేశార‌నే వ్యాఖ్యలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో పార్టీ నుంచి ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు వ‌చ్చిన డ‌బ్బులు కూడా కింద‌కి వెళ్లనివ్వలేదనే ఆరోప‌ణలు ఉన్నా యి. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్లుగా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నవారే ఈ డ‌బ్బును దాచుకున్నార‌న్న చ‌ర్చ న‌డిచింది. దీంతో పాటు కోల‌గ‌ట్ల వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోవ‌డంతో కూడా ఆయ‌న‌కు సానుభూతి క‌లిసి వ‌చ్చింది. దీంతోనే అదితి ఓట‌మి పాల‌య్యారు. ఇదిలావుంటే, అదితి మాత్రం ఓట‌మిని కూడా త‌న‌కు అను కూలంగా మార్చుకుని నియోజ‌క‌వ‌ర్గానికి చేరువ అవుతున్నారు. నిత్యం ప్రజ‌ల్లోనే ఉంటున్నారు.

తండ్రి రాజకీయాలకు భిన్నంగా…

నిజానికి ఈ ప‌రిణామం.. రాజుగారి నైజానికి వ్యతిరేకం. ఆయ‌న గెలిచినా.. ఓడినా.. పెద్దగా నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల‌తో ఉండేవారు కాద‌నే టాక్ ఉంది. కానీ, దీనికి భిన్నంటా అదితి మాత్రం ప్రజ‌ల‌కు చేరువ‌య్యారు. ఇది ఆమెకు మంచి ఇమేజ్ తీసుకువ‌చ్చింది. ఇక‌, జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న ఓ సంచ‌ల‌న నిర్ణయం కొన్ని ద‌శాబ్దాలుగా మాన్సాస్‌ ట్రస్టుకు చైర్మన్‌గా ఉన్న రాజుగారిని తొల‌గించ‌డం. అదే స‌మ‌యంలో ఆయన అన్నగారి కుమార్తె సంచ‌యిత‌ను అనూహ్యంగా నియ‌మించ‌డం. ఈ ప‌రిణామాలు రాజుగారి కుటుంబంపై సానుభూతి ప‌వ‌నాలు వీచేలా చేశాయ‌ని అంటారు.

భవిష్యత్ ఉందని…..

ఈ నేప‌థ్యంలోనే అశోక్ భావ‌జాలం రుద్దకుండా వ‌దిలేస్తే.. అదితి బాగానే పుంజుకుంటార‌ని అంటున్నారు స్థానిక టీడీపీ నేత‌లు. ఎనీటైం రెస్పాండ్ అవుతున్నార‌ని, అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కు కార్యక‌ర్తల‌కు ఖ‌ర్చు పెడుతున్నారని నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌ని కూడా అంటున్నారు. మొత్తంగా అదితి ప‌రిస్థితి పుంజుకుంద‌నే భావ‌న ఏర్పడుతోంది. మ‌రి ఈ దూకుడు కొన‌సాగిస్తే.. ఇక‌, అదితి అశోక్ రాజ‌కీయ వార‌సురాలిగా నిల‌బ‌డ‌డం ఖాయం.

Tags:    

Similar News