దాస్ గారి భ‌క్తి.. సీఎస్ స్థాయికి చేర్చనుందా..?

ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి (సీఎస్‌). అంటే.. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా.. సీఎం రాజ‌కీయంగా కీల‌క‌మైతే.. అధికారికంగా.. సీఎస్.. సీఎంతో స‌ర్వస‌మానం. సీఎం తీసుకునే నిర్ణయాల‌పై సీఎస్ [more]

Update: 2020-10-23 15:30 GMT

ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి (సీఎస్‌). అంటే.. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా.. సీఎం రాజ‌కీయంగా కీల‌క‌మైతే.. అధికారికంగా.. సీఎస్.. సీఎంతో స‌ర్వస‌మానం. సీఎం తీసుకునే నిర్ణయాల‌పై సీఎస్ సంత‌కం చేస్తేనే.. ప‌నులు ముందుకు సాగుతాయి. సీఎం తీసుకునే నిర్ణయాల‌ను తూ.చ‌.త‌ప్పకుండా అమ‌లు చేయ‌డం.. కొర్రీలు వేయ‌కుండా ముందుకు సాగ‌డం వంటివి చేసేవారికే దాదాపు ఈ ప‌ద‌వులు ద‌క్కుతాయి. అదే స‌మ‌యంలో సీనియార్టీ అనేది ఉన్నప్పటికీ.. దీనికి రెండో ప్రాధాన్యమే ఉంటుంది.

పదవీ కాలం పూర్తి కావడంతో….

ఇప్పుడు ఏపీలో నీలం సాహ్ని.. సీఎస్‌గా ఉన్నారు. వాస్తవానికి ఆమె ప‌ద‌వీ కాలం అయిపోయింది. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు ఆమె కాలాన్ని ఆరు మాసాలు పెంచుకుని మ‌రీ కొన‌సాగిస్తోంది. దీనికి కార‌ణం.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండ‌డమే. ఎన్నడూ లేనిది.. ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌నిది.. సీఎస్ హైకోర్టుకు హాజ‌రుకావ‌డం. ఇలాంటి ప‌రిణామాలు ఎదురు కావ‌డాన్ని సీఎస్ స్థాయి అధికారులు అవ‌మానంగా భావించి ప‌క్కకు త‌ప్పుకొంటారు. లేదా సీఎంకు స‌హ‌కారాన్ని త‌గ్గించుకుంటారు. కానీ, ఏపీలో మాత్రం సాహ్ని.. కోర్టుకు కూడా చిరునవ్వుతో వెళ్లి వ‌చ్చారు.

ఆమెనే కొనసాగించాలని….

ఈ ప‌రిణామాలనే సీఎం జ‌గ‌న్ కోరుకుంటున్నార‌నే ప్రచారం ఉంది. ఇక‌, ఇప్పటికీ..ఆమెనే కొన‌సాగించాల ‌ని సీఎంకు ఉన్నప్పటికీ.. సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండే అధికారిని ఎంపిక చేయాల‌ని త‌ల‌పోస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న సీనియ‌ర్ అధికారుల్లో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ క‌నిపిస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు పోల‌వ‌రాన్ని పొలిటిక‌ల్ అజెండాగా ఎంచుకున్న‌ప్పుడు.. దీనిలో అవినీతి జ‌రిగింద‌ని చెప్పిన అధికారి ఆయ‌ననేన‌ని, జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా చ‌క్రం తిప్ప‌గ‌ల స‌మ‌ర్ధుడిగా ఆయ‌న నిలిచార‌ని వైసీపీలో చ‌ర్చసాగింది.

ఆయనకే పగ్గాలు…..

ఇప్పుడు సీఎస్‌గా ఆయ‌న‌ను నియ‌మించే అవ‌కాశం ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. తాజాగా ఆయ‌న‌కు సీసీఎల్ ఏ వంటి కీల‌క బాధ్యత‌లు అప్పగించారు. ఇక‌, నీలం త‌ర్వాత సీఎస్ ప‌ద‌వి ఈయ‌న‌కేన‌ని తెలుస్తోంది. వ్యక్తిగా దాస్‌.. అవినీతి ర‌హితుడు.. వివాద ర‌హితుడు.. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు సానుకూల‌మ‌నే అభిప్రాయం ఉంది. సానుకూలం అయినా కాక‌పోయినా.. జ‌గ‌న్ చెప్పే ప్రతి విష‌యాన్నీ వ్యతిరేకించే ధోర‌ణి మాత్రం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ఈ ఛాన్స్ ద‌క్కడం ఖాయ‌మ‌ని అంటున్నారు. వాస్తవానికి సీనియార్టీని చూస్తే..స‌తీష్ చంద్ర ఈ వ‌రుస‌లో ఉన్నారు. కానీ, ఆయ‌న గ‌తంలో చంద్రబాబు హ‌యాంలో వైసీపీకి వ్యతిరేకంగా చ‌క్రం తిప్పార‌నే ఆరోప‌ణ‌లు ఉన్ననేప‌థ్యంలో దాస్‌కు ప‌గ్గాలు అప్పగిస్తార‌నే ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News