అదితి అంత అగ్రెస్సివ్ గా వెళ్లగలరా?

విజయనగరం మహారాజు పూసపాటి వారసుడు అశోక్ గజపతిరాజు ఆశలన్నీ ఇపుడు కుమార్తె మీదనే ఉన్నాయి. అశోక్ రాజకీయం భవిష్యత్తు అంతా కూడా ఇపుడు అదితి గజపతిరాజు మీదనే [more]

Update: 2021-09-17 05:00 GMT

విజయనగరం మహారాజు పూసపాటి వారసుడు అశోక్ గజపతిరాజు ఆశలన్నీ ఇపుడు కుమార్తె మీదనే ఉన్నాయి. అశోక్ రాజకీయం భవిష్యత్తు అంతా కూడా ఇపుడు అదితి గజపతిరాజు మీదనే ఆధారపడ్డాయని అంటున్నారు. అన్న కూతురు సంచయిత గజపతిరాజు రెండేళ్ల కాలంలో జనాలలో బాగానే ఫోకస్ అయ్యారు. ఆమె దూకుడు తో కూడిన పాలిటిక్స్ చేయడంలో దిట్ట అని నిరూపించుకున్నారు. సొంతంగానే ఆమె చక్రం తిప్పారు. బీజేపీలో చేరిన ఆమె వైసీపీ ద్వారా మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ పదవిని పొందడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక తన మీద అప్పట్లో వచ్చిన ప్రతీ విమర్శకు ధీటైన జవాబు ఇస్తూ తాను ఎక్కడా తగ్గనని నిరూపించుకున్నారు.

నెమ్మదితనమే…..?

ఇక అదితి గజపతిరాజు అయితే నెమ్మదితనానికి పెట్టింది పేరు అంటారు. ఆమె తండ్రి అడుగు జాడలలోనే ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. తండ్రి చాటు బిడ్డగానే గుర్తింపు పొందారు. అదితి గజపతిరాజు స్వయంగా ఎంతవరకూ పోరాడగలరు అన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియలేదు. ఇక ఆమె దూకుడు రాజకీయాలకు దూరం అని చెబుతారు. చూడబోతే కాలం అలా లేదు. రాజకీయాల్లో ఫోకస్ ఎపుడూ రేసులో దూసుకొచ్చేవారి మీదనే ఉంటుంది. తప్పో ఒప్పో అన్నది పక్కన పెడితే జనం కూడా అలాంటి వారికే అట్రాక్ట్ అవుతున్నారు.

పోటా పోటీనే…?

తన తండ్రి అశోక్ ని అన్నేసి మాటలు పెదనాన్న కుమార్తె అంటూంటే అదితి గజపతిరాజు ఆనాడు గట్టిగా బదులివ్వలేకపోయారు. అశోక్ నేరుగా వచ్చి కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చేది. అదే అదితి గజపతిరాజు కూడా అగ్రెస్సివ్ గా ఉంటే కచ్చితంగా సంచయితకు అడ్డుకట్ట మొదట్లోనే పడేది అన్న చర్చ అయితే పూసపాటి వారి అభిమానులలో ఉంది. అశోక్ వరకూ ఓకే కానీ అదితి తండ్రి వారసత్వాన్ని కొనసాగించగలదా అన్నదే చర్చగా ఉంది. ఏడు పదుల వయసులో ఉన్న అశోక్ తరువాత మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు, ఆధిపత్యం మీద మరో మారు యుద్ధం రావడం ఖాయమే అంటున్నారు. అలాగే ఇక మీదట అనునిత్యం సంచయితతో పోటా పోటీగానే అదితి గజపతిరాజు ఉండాల్సి వస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు.

ఆ సంగతేంటి …?

పూసపాటి తరంలో ఆనంద్ అశోక్ ల తరం తరువాత అదితి గజపతిరాజు, సంచయితల తరం వచ్చేసినట్లే. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న సంచయిత‌ 2024 ఎన్నికల బరిలో కచ్చితంగా నిలబడడం ఖాయం. ఆమెను వైసీపీ రంగంలోకి దింపుతుందని కూడా అంటున్నారు. మరి ఆమెని ఢీ కొట్టాలి అంటే అదితి గజపతిరాజు ఇప్పటి నుంచే పొలిటికల్ గా వేగం పెంచాలని కూడా అంటున్నారు. అశోక్ కి వెన్నుదన్నుగా ఉంటూ ఆయన మార్క్ పాలిటిక్స్ కి తానే సిసలైన వారసురాలిని అని అదితి గజపతిరాజు నిరూపించుకోవాలి. నిజంగా ఇది చాలా కష్టమైన వ్యవహారమే. కానీ ఇపుడు అనివార్యం. అందుకే అశోక్ శిబిరంలో అదితి గజపతిరాజు భవిషత్తు మీదనే విసృతమైన చర్చ సాగుతోందిట.

Tags:    

Similar News