అదీప్ పీకల్లోతు వివాదాల్లో?

చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాడు. సీనియర్ నేతను ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నాడు. జగన్ నుంచి ప్రశంసలు పొందారు. అయితే ఏడు నెలల వైసీపీ [more]

Update: 2020-01-13 12:30 GMT

చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాడు. సీనియర్ నేతను ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నాడు. జగన్ నుంచి ప్రశంసలు పొందారు. అయితే ఏడు నెలల వైసీపీ ప్రభుత్వంలో వివాదాలను ఎదుర్కొంటున్న తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన రికార్డుకు ఎక్కారు. ఆయనే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు. ఆదీప్ రాజు వైసీపీ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా ఎదిగారు. ఆయన కష్టపడిన తీరు చూసి జగన్ సయితం ఆశ్యర్యపోయారు. అందుకే కొందరు అడ్డుపడినా అదీప్ రాజుకే జగన్ టిక్కెట్ కేటాయించారు. జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ అదీప్ రాజు విజయం సాధించారు.

సీనియర్ నేతను ఓడించి….

సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ఓడించడంతో అదీప్ రాజు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీలో శభాష్ అదీప్ అని అనని వారు ఉండరేమో. అయితే తాజాగా ఎమ్మెల్యే అదీప్ రాజు ఒక భూ వివాదంలో చిక్కుకుకున్నారు. పెందుర్తి మండలం రాంపురం సర్వే నెంబరు ఒకటిలో ఉన్న ఎనిమిది ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు వీర్రాజు చెరువు వివాదం అదీప్ రాజు ను చుట్టుముట్టింది.

చెరువును ఆక్రమించారంటూ….

పెందుర్తి నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పైన కూడా భూ వివాదాలు చుట్టుముట్టాయి. ముదపాక భూములు ఆక్రమించారంటూ అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజు పెందుర్తి మండలంలోని ఎనిమిది ఎకరాల చెరువును కబ్జా చేస్తున్నారంటూ టీడీపీ పెద్దయెత్తున విమర్శలకు దిగుతోంది. చెరువును పూడ్చి నలభై కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే అదీప్ రాజు సొంతం చేసుకుంటున్నారని టీడీపీ ఆందోళనకు దిగుతుంది. ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. అదీప్ రాజు కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ ఫైర్ అవుతోంది. చెరువులోకి దిగి మరీ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

తమ స్థలమేనంటూ…..

కానీ అదీప్ రాజు మాత్రం అది ప్రభుత్వ చెరువు అని నిరూపించాలని సవాల్ విసురుతున్నారు. అది ఇనాం భూమి అని, కావలి వీర్రాజు 1907లో టీడీ నెంబరు 2568 కింద ప్రభుత్వం నుంచి పట్టా పొందారని, తర్వాత ఆ భూమిని 1985లో నాయుడు బాబుకు విక్రయించారన్నారు. 1988లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేసినట్లు అదీప్ రాజు చెప్పుకొస్తున్నారు. లోక్ అదాలత్, వివిధ న్యాయాస్థానాల్లోనూ తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందని అదీప్ రాజు చెబుతున్నారు. టీడీపీ తనపై కావాలిన బురద జల్లుతుందని తెలిపారు. తాను ప్రభుత్వ చెరువును ఆక్రమించానని రుజువు చేస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని అదీప్ రాజు చెబుతున్నారు. మొత్తం మీద విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తరలివస్తున్న సందర్భంలో యువ ఎమ్మెల్యే అదీప్ రాజు పై భూ వివాదాలు రావడం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News