మొహం చాటేస్తున్నారే

ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు. కనీసం అధినేతకు ముఖం చూపేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. కడప [more]

Update: 2019-07-12 08:00 GMT

ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు. కనీసం అధినేతకు ముఖం చూపేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలో మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. మరోవైపు పార్టీ నుంచి జంపింగ్ లు కూడా ఎక్కువ కావడంతో కడప జిల్లాలో పార్టీ పరిస్థితి అధినేతకు కూడా అర్థం కాకుండా ఉంది.

బాబు తిరుగుతున్నా…..

దారుణ ఓటమితో కుంగిపోయి ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబునాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యటించి వైసీీపీ దాడుల్లో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబునాయుడు పార్టీకి తిరిగి ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సీనియర్ నేతలు ఎవరూ ఆయనకు సహకరించడం లేదు.

పట్టించుకోని నేతలు….

కడప జిల్లాను తీసుకుంటే ఇక్కడ హేమాహేమీలు ఉన్నారు. ఎన్నికలకు ముందు పట్టుబట్టి మరీ తమకు టిక్కెట్లు ఇప్పించుకున్న నేతలు ఉన్నారు. ప్రధానంగా జమ్మలమడుగు కు చెందిన మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటినుంచి పార్టీని పట్టించుకోవడం లేదు. నాలుగు రోజుల క్రితం చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళుతూ కడప ఎయిర్ పోర్టులో కొంతసేపు ఆగారు. ఆయనను కలిసేందుకు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ లు రాకపోవడం చర్చనీయాంశమైంది.

సీఎం రమేష్ వల్లనేనా?

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కడప జిల్లాలో చీమ చిటుక్కు మన్నా సీఎం రమేష్ కు తెలియకుండా జరగని పరిస్థితి నెలకొంది. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడంతో వరద రాజులు రెడ్డి లాంటి వాళ్లు మినహా సీఎం రమేష్ ప్రాధాన్యత గురించి ఎవరూ ప్రశ్నించలేకపోయారు. ఇప్పుడు దారుణ ఓటమి చవిచూడటం, చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ టీడీపీని వీడటంతో దీని వెనక చంద్రబాబు ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే ఆదినారాయణరెడ్డి లాంటి నేతలు చంద్రబాబునాయుడుకు దూరంగా ఉంటున్నారన్న టాక్ బలంగా పార్టీలో విన్పిస్తుంది. మరి చంద్రబాుబు నాయుడు కడప జిల్లాలో నేతల మధ్య సఖ్యత ఎలా కుదురుస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News