ఆది దుమ్ము రేపారుగా… టీడీపీని జీరో చేశారే?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ స‌త్తా చాటింది. ప్రధానంగా ఇక్కడ కీల‌క నాయ‌కుడిగా [more]

Update: 2021-03-06 12:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ స‌త్తా చాటింది. ప్రధానంగా ఇక్కడ కీల‌క నాయ‌కుడిగా ఉన్నమాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి దూకుడుగా వ్యవ‌హ‌రించి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ ప‌ట్టు నిలిపారు. జ‌మ్మల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ రెడ్డికి ప్రత్యేక పాత్ర ఉంది. తొలుత కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఎదిగిన ఆది.. త‌ర్వాత వైసీపీలో చేరారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయ‌న 2014లో వైసీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచాక టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌విని పొందారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌ర‌గ‌ణాన్ని కాపాడుకునేందుకు ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

అత్యధిక స్థానాల్లో…

ఈ క్రమంలో ఇక్కడ బాధ్యత‌లు ఆదినారాయ‌ణ రెడ్డి చూస్తున్నారు. ఇక‌, తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆది త‌న స‌త్తా చాటారు. బీజేపీ మ‌ద్దతు దారులుగా త‌న అభ్యర్థుల‌ను రంగంలోకి దింప‌డంతోపాటు.. టీడీపీని కూడా మేనేజ్ చేశార‌ని అంటున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజ‌యం సాధించిన నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా ఉంటే.. అది జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గమే. ఇక్కడ మొత్తం 115 పంచాయ‌తీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. ఇక్కడ టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. చాలా చోట్ల పోటీ చేయ‌లేదు. ప‌లు స‌ర్పంచ్ స్థానాల్లో టీడీపీ బీజేపీకి స‌పోర్ట్ చేసింది. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి కొన్నేళ్లుగా పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు.

టీడీపీకి దిక్కులేక….

ఇక గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలిచి.. మంత్రిగా ప‌ని చేసిన ఆదినారాయ‌ణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరారు. అస‌లు టీడీపీకి ఇక్కడ నాయ‌కుడు లేక‌పోవ‌డం కూడా పార్టీకి దెబ్బకొట్టింది. ఇప్ప‌ట్లో ఇక్కడ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావ‌డం లేదు స‌రిక‌దా ? జ‌మ్మల‌మ‌డుగులో టీడీపీ మ‌రో ప‌దేళ్లకు కూడా పుంజుకునే ప‌రిస్థితి లేదు. ఆదినారాయ‌ణ రెడ్డి, రామ సుబ్బారెడ్డితో పాటు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి లాంటి ఉద్దండుల‌ను ఢీకొట్టే స‌త్తా ఉన్న నేత టీడీపీలో స్థానికంగా అయితే ఎవ్వరూ భూత‌ద్దంలో పెట్టి వెతికినా క‌న‌ప‌డ‌డం లేదు.

రెండోస్థానంలో బీజేపీ…..

ఇక్కడ పంచాయ‌తీ రిజ‌ల్ట్ ప‌రిశీలిస్తే మొత్తం 115 పంచాయ‌తీల‌కు వైసీపీ 95, బీజేపీ 16 సాధించాయి. స్వతంత్రులు ముగ్గురు విజ‌యం సాదించారు. టీడీపీ జీరో అయింది. ఇక‌, మండ‌లాల వారీగా చూస్తే.. ముద్దనూరు మండ‌లంలో మొత్తం19 పంచాయ‌తీల‌కు వైసీపీ 17 , బీజేపీ 2సాధించాయి. కొండాపురం మండ‌లంలో మొత్తం 24 పంచాయ‌తీలుంటే.. వైసీపీ 21 స్థానాలు, బీజేపీ మూడు, మైల‌వ‌రం మండలంలోని 19 పంచాయ‌తీల్లో 16 వైసీపీ, 3 బీజేపీ గెలుచుకున్నాయి.

బీజేపీకి రాష్ట్రంలోనే….

ఎర్రగొండ పాలెం మండ‌లంలో 17 పంచాయ‌తీల్లో వైసీపీ 15, బీజేపీ 2, పెద‌మొడియం మండ‌లంలో 22 పంచాయ‌తీల‌కు వైసీపీ 21, బీజేపీ 1, జ‌మ్మల‌మ‌డుగు మండ‌లంలో మొత్తం 14 పంచాయ‌తీల‌కు 4 మాత్రమే వైసీపీ ద‌క్కించుకోగా.. బీజేపీ ఏకంగా 8 చోట్ల విజ‌యం సాధించింది. ఇక‌, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజ‌యం సాధించారు. ఏదేమైనా ఏపీలో ఎంతో మంది బీజేపీ నాయ‌కులు ఉన్నారు… ఎంతో మంది పార్టీ మారి కాషాయ కండువా క‌ప్పుకున్నారు. జ‌మ్మల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ రెడ్డి స‌త్తా చాటిన‌ట్టుగా ఏ నాయ‌కుడు.. ఎక్కడా స‌త్తా చాట‌లేదు. ఏపీ బీజేపీలో పంచాయ‌తీ హీరోగా ఆది ఒకే ఒక్కడు అయ్యాడు.

Tags:    

Similar News