ఆది మళ్లీ ఇటు వైపు చూస్తున్నారా?

కొందరి చేరికతో పార్టీకి ప్రయోజనం ఉంటుంది. మరికొందరు మాత్రం తమ కోసం పార్టీని ఉపయోగించుకుంటారు. అలాంటి వారిలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఒకరు. వైసీపీలో నెగ్గి టీడీపీలో [more]

Update: 2021-02-07 15:30 GMT

కొందరి చేరికతో పార్టీకి ప్రయోజనం ఉంటుంది. మరికొందరు మాత్రం తమ కోసం పార్టీని ఉపయోగించుకుంటారు. అలాంటి వారిలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఒకరు. వైసీపీలో నెగ్గి టీడీపీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే బీజేపీలో చేరినా ఆయన మనసంతా టీడీపీపైనే ఉంది. తిరిగి టీడీపీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి రెడీ అవుతున్నట్లు సమాచారం.

తాత్కాలికమేనట…..

ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నా అది తాత్కాలికమే. దాదాపు ఆయన అనుచరుల్లో ముఖ్యులు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇందుకు కారాణాలు కూడా ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు దశాబ్దాల కాలం నుంచి ప్రత్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డితో రాజీ పడ్డారు. అందులో భాగంగా 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ ను రామసుబ్బారెడ్డికే వదిలేసి తాను కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మళ్లీ జమ్మలమడుగు నుంచే….

నిజానికి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం అప్పట్లో ఆదినారాయణరెడ్డికి ఇష్టం లేకపోయినా చంద్రబాబు వత్తిడి మేరకు పోటీ చేశారు. ఇప్పుడు జమ్మలమడుగులో టీడీపీకి నేత లేరు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో జమ్మలమడుగులో పార్టీకి సారథ్యం వహించేవారు లేరు. జమ్మలమడుగులో బీజేపీ అనేది లేదు. కేవలం ఆదినారాయణరెడ్డి చేరడంతోనే ఆ పార్టీ జెండాలు అక్కడక్కడ ఎగురుతున్నాయి. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి బీజేపీలో కూడా పెద్దగా దూకుడుగా లేరు.

అందుకే దూరంగా…..

మొన్నా మధ్య ప్రొద్దుటూరులో టీడీపీ నేత హత్య విషయంలో ఆదినారాయణరెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హత్య అని ఆయన పేర్కొన్నారు. తనపై వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని భావించి ఆదినారాయణరెడ్డి హడావిడిగా బీజేపీలో చేరారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగానే జమ్మలమడుగు నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు బీజేపీలో ఆయన యాక్టివ్ గా లేకపోవడం, ఆయన అనుచరులు టీడీపీ వైపు చూస్తుండటమే కారణమని చెప్పాలి. మొత్తం మీద ఆదినారాయణరెడ్డి మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు.

Tags:    

Similar News