ఆదిని ఆ దిగులు వదలడం లేదట

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కేసుల భయం వీడటం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై మరిన్ని కేసులు నమోదవుతాయని, పాత కేసులను తిరగదోడతారని ఆదినారాయణరెడ్డి భావిస్తున్నారు. [more]

Update: 2020-07-23 12:30 GMT

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కేసుల భయం వీడటం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై మరిన్ని కేసులు నమోదవుతాయని, పాత కేసులను తిరగదోడతారని ఆదినారాయణరెడ్డి భావిస్తున్నారు. వరసగా మాజీ మంత్రులను టార్గెట్ చేస్తుండటంతో తన వంతు ఎప్పుడనే ఆందోళన ఆయనను వీడటం లేదు. అందుకే ఆదినారాయణరెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలసి వచ్చారంటున్నారు.

వైసీపీ నుంచి…..

ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014లో వైసీపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ నే ఎక్కువగా ఆదినారాయణరెడ్డి టార్గెట్ చేసేవారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగేవారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

వైఎస్ వివేకా హత్య కేేసులోనూ ఆదినారాయణరెడ్డిని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ప్రశ్నించింది. ఈ కేసులో తనను ఇరికిస్తారన్న భయంతోనే ఆయన వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ బీజేపీ నుంచి జమ్మల మడుగు నియోజకవర్గంలో తన వర్గాన్ని పోటీ చేయించే ప్రయత్నం చేశారు ఆదినారాయణరెడ్డి.

అందుకే ఢిల్లీ పర్యటన…

దీంతో తాను ప్రభుత్వానికి టార్గెట్ అయ్యానని, ఎప్పుడైనా తనను కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఆదినారాయణరెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే రాష్ట్ర రాజకీయాలకు దూరంగా బెంగళూరులోని వ్యాపారాలపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ ఇటీవల కాలంలో మాజీ మంత్రుల వరస అరెస్ట్ లతో అలర్టయిన ఆదినారాయణరెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలను కలసి రావడం చర్చనీయాంశమైంది. అసలు వైసీపీ ప్రభుత్వం తనను వేధిస్తుందనే ఆయన బీజేపీలోకి వెళ్లారు.

Tags:    

Similar News