ఆదాల అసహనం వారిపైనేనట

కరోనా తీవ్రతతో చాలా మంది రాజకీయ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కరోనా సాకుతో కావాలని దూరమయ్యే నేతలు కూడా కొందరున్నారు. వారిలో నెల్లూరు [more]

Update: 2021-07-05 02:00 GMT

కరోనా తీవ్రతతో చాలా మంది రాజకీయ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కరోనా సాకుతో కావాలని దూరమయ్యే నేతలు కూడా కొందరున్నారు. వారిలో నెల్లూరు వైసీపీ పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన గెలిచిన నాటి నుంచి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకే కాదు ఆయన క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండటం లేదు. అసలు ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలో ఉన్నారా? లేదా? అనుమానం కలుగుతుంది.

చివరి సమయంలో చేరి….

ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికలకు చివరి సమయంలో వైసీపీలో చేరారు. సహజంగా బడా కాంట్రాక్టరు అయిన ఆదాల పార్టీలు మార్చడంపై పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో వంద కోట్ల బిల్లులను తీసుకున్న తర్వాతనే వైసీపీలో చేరారు. ఆయనకు రాజకీయం కంటే తన వ్యాపారాలే ముఖ్యమని ఆదాల ప్రభాకర్ రెడ్డిని దగ్గర నుంచి చూసిన వారు ఎవరైనా చెబుతారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా ఆదాల వెనకడుగు వేయడానికి కారణం.

మాట చెల్లుబాటు కావడం లేదనేనా?

నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎక్కడా ఛాన్స్ లేదు. పదవులు భర్తీ విషయంలో గాని, పనులు ఇప్పించుకోవడంలో గాని ఆయన సిఫార్సులు చెల్లడం లేదు. నెల్లూరు జిల్లా రాజకీయం మొత్తం కొందరి చేతుల్లోనే ఉందన్నది ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుల ఆరోపణ. అందుకే తన నియోజకవర్గం పరిధిలోని ఏ ఎమ్మెల్యేతో టచ్ లో లేకుండా ఉన్నారు. వాళ్లు కూడా ఆదాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎంపీగా ఎన్నికయిన తర్వాత…..

ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఎన్నికయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ను కలసింది అతి కొద్దిసార్లే. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు తప్పించి ఆయన జగన్ ఎదుట పడలేదు. జగన్ కనీసం 11 సార్లు ఢిల్లీ వెళ్లారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి కన్పించకపోవడం విశేషం. అయితే ఆయన స్థానిక జిల్లా నేతల పట్ల అసంతృప్తిగా ఉన్నారని, అందుకే వ్యాపారాలపైనే ఆయన దృష్టి పెట్టారని చెబుతున్నారు. మొత్తం మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News