కళా కంటే ఘోరంగా తయారయినట్లేనా?

అచ్చెన్నాయుడు సమావేశాలకే పరిమితమయ్యారు. పార్టీ కీలక నిర్ణయాల్లో ఆయనకు చోటు లేదు. కేవలం ఉత్సవ విగ్రహంలాగా కూర్చుండ బెట్టారు. అచ్చెన్నాయుడు సయితం ఇదే ఆలోచనలో ఉన్నారు. తాను [more]

Update: 2021-09-22 00:30 GMT

అచ్చెన్నాయుడు సమావేశాలకే పరిమితమయ్యారు. పార్టీ కీలక నిర్ణయాల్లో ఆయనకు చోటు లేదు. కేవలం ఉత్సవ విగ్రహంలాగా కూర్చుండ బెట్టారు. అచ్చెన్నాయుడు సయితం ఇదే ఆలోచనలో ఉన్నారు. తాను అనవసరంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని తీసుకున్నానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడును సాధ్యమయినంత దూరంగా పెట్టాలన్నదే పార్టీ అధినాయకత్వం భావనగా కన్పిస్తుంది.

అధ్యక్షుడయిన తర్వాత….

అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అయితే ఆయనను పార్టీ నేతగానే ఇప్పటికీ నేతలు, క్యాడర్ పరిగణిస్తున్నారు. అధ్యక్షుడిగా చూడటం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారంలోనూ, అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతోనూ పార్టీ ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్రీమెన్ కమిటీని నియమించారు. అచ్చెన్నాయుడితో ప్రమేయం లేకుండానే జిల్లాల్లోనూ నిర్ణయాలు జరిగిపోతున్నాయి.

అదే దెబ్బతీసిందా?

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమంటున్నారు. లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీ పైనా వ్యాఖ్యానించడంతో ఆయన పై క్షేత్ర స్థాయితో కొంత వ్యతిరేకత వ్యక్తమయింది. కిందిస్థాయి క్యాడర్ సయితం అచ్చెన్నాయుడు మాటలను తప్పు పట్టారు. అలాంటి నేత నాయకత్వంలో తాము పనిచేయబోమని కొందరు నేరుగా చంద్రబాబుకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది.

దూరం పెట్టినట్లేనా?

మరోవైపు చంద్రబాబు కూడా నేరుగా నేతలతో మాట్లాడుతుండటం, జిల్లా పర్యటనలకు నారా లోకేష్ శ్రీకారం చుట్టడంతో అచ్చెన్నాయుడు కేవలం విజయవాడ, టెక్కలికే పరిమితమయ్యారు. తన నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకే ఆయన ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇలా అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఆయనను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఒక రకంగా కళా వెంకట్రావు లోకేష్ కు దగ్గరగా ఉండటంతో ఆయనే కొంత మెరుగ్గా వ్యవహరించారన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి.

Tags:    

Similar News