అచ్చెన్న నారద సంసారం..?

తెలుగుదేశం పార్టీలో ఎవరెన్ని చెప్పుకున్నా కూడా సర్వం సహా చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీల్లో అధినేత తప్ప ఇతర నాయకులకు ఎంత స్వేచ్చ ఉంటుందో [more]

Update: 2020-11-14 12:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఎవరెన్ని చెప్పుకున్నా కూడా సర్వం సహా చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీల్లో అధినేత తప్ప ఇతర నాయకులకు ఎంత స్వేచ్చ ఉంటుందో అందరికీ విదితమే. ఇక జగన్ మాదిరిగా బాబు పార్టీ నేతలను నమ్మి వదిలివేసే రకం అసలు కాదు, ప్రతీదీ ఆయనే దగ్గరుండి మరీ చూసుకుంటారు. ఒక పంచాయతీ స్థాయి సమస్య అయినా తాను జాతీయ అధ్యక్షుడిని అని మరచి మాట్లాడేస్తూంటారు. ఇలా పరిధులు, పరిమితులు అతిక్రమించడం బాబుకు అలవాటే. అందుకే టీడీపీ అంటే ఆయన గొంతే వినిపిస్తుంది. ఆయన మాటే ఫైనల్ కూడా అవుతుంది.

అందరూ నేతలే….

అలాంటిది బాబు తాను ఒక్కరే కాకుండా 219 మందితో జంబో జెట్ కార్యవర్గాన్ని నియమించి అచ్చెన్నకు కానుకగా ఇచ్చేశారు. ఇంతమందిని తీసుకుని అచ్చెన్నాయుడు అతి పెద్ద సర్కర్ చేయాలన్న మాట. పైగా అందరూ నాయకులే. అందరూ సీనియర్లే. ఎవరు ఎవరినీ లెక్క చేసే సీన్ లేదు. ప్రతీ వారూ చంద్రబాబు దయతో మాకు పదవులు దక్కాయని అంటారు. వారికి ఏ చిన్న సమస్య ఉన్నా ఆయనకే చెప్పుకుంటారు. అపుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఎందుకు దండుగ అన్న మాట ఉంది. ఆ బాధలు, అవమానాలు అన్నీ కూడా కళా వెంకటరావు అనుభవించారు. ఇపుడు అచ్చెన్నాయుడు వంతు వచ్చింది అంటున్నారు.

జిల్లాలోనే అలా….

ఇక శ్రీకాకుళం జిల్లా వరకూ చూసుకుంటే అది అచ్చెన్నాయుడు సొంత జిల్లా. ఇక్కడే అచ్చెన్న మాట వినే వారు వినని వారు కూడా ఉన్నారు. గౌతు శ్యామసుందర శివాజీ వారసురాలు శిరీష రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాజాగా నియమితులయ్యారు. ఆమెది ఒక గ్రూప్, అలాగే కళా వెంకటరావు పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఆయనకు అచ్చెన్నకు మధ్య విభేధాలు అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి వేళ అందరినీ కలుపుకుని అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే ముందుకు పోలేరు అన్న మాట ఉంది. అలాంటిది ఏపీలోని పదమూడు జిల్లాలను ఆయన ఏక త్రాటి మీదకు తీసుకురాగలరా అన్నది పెద్ద ప్రశ్న.

వారిని దారికి తేగలరా…?

ఇక విశాఖలో అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ హోదాలో తాజాగా టూర్ వేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చాలా కాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరో నేత, ఎమ్మెల్యే గణబాబు సైతం సైలెంట్ గా ఉంటున్నారు. వీరెవరూ కొత్త ప్రెసిడెంట్ ని కలవలేదు. మరీ ఉత్తరాంధ్రాకు గుండె కాయ లాంటి విశాఖలో పార్టీని ఒడ్డున పడేసేందుకు అచ్చెన్నాయుడు దగ్గర ఉన్న మంత్రం ఏంటన్నది చూడాలి. ఆయనకు, గంటాకు గతంలోనే విభేదాలు ఉన్నాయని చెబుతారు. దాంతో అచ్చెన్నాయుడు ఇలాటి గొడవలను కొత్తగా కెలుక్కోరు. మరి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేయు పనులేంటి అంటే ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లేనా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. మొత్తానికి అచ్చెన్నాయుడు కోరకున్నా కూడా అతి పెద్ద సైన్యాన్ని చంద్రబాబు ఇచ్చేసి కత్తి మాత్రం చేతికి ఇవ్వకుండా యుద్ధం చేయమంటున్నారు అని సొంత పార్టీలోనే అంటున్నారు.

Tags:    

Similar News