అద్దం లాంటి అసహనం…?

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆంతరంగిక సందర్భంలో ఒక అనుచరుడితో యథాలాపంగా జరిపిన [more]

Update: 2021-04-15 05:00 GMT

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆంతరంగిక సందర్భంలో ఒక అనుచరుడితో యథాలాపంగా జరిపిన సంభాషణ పార్టీకి ఇబ్బంది కరంగా పరిణమించింది. ఆ తరహా వ్యాఖ్యలు పార్టీలో కొత్తేమీ కాదు. వైసీపీ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడి అధికార పార్టీ మీడియాలో ప్రసారం కావడమే చర్చకు దారి తీసింది. గడచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసంతృప్తిలో ఉన్నాయి. ఇటీవలి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల తర్వాత ఇది మరింతగా పెరిగింది. ఏ పార్టీలో అయినా అధికారంలో లేనప్పుడు గతాన్ని తలచుకుని అధిష్ఠానాన్ని తిట్టుకోవడం సహజం. అగ్రనాయకత్వం తప్పిదాల వల్లే అధికారం చేజారిందని విమర్శించుకోవడమూ మామూలే. అధికారంలో ఉన్నప్పుడు తమకు తగిన పదవులు లభించడం లేదని వాపోవడమూ చూస్తుంటాం. ఇదేమంత అసాధారణం కాదు. కానీ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే చంద్రబాబు , లోకేశ్ ల ను ఉద్దేశించి చులకనగా మాట్టాడటం కచ్చితంగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అంశం. పార్టీలో దిగువ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ నెలకొని ఉన్న అసహనానికి అద్దం పట్టే పరిణామం. అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎలా స్టింగ్ చేసింది? ఎంతవరకూ వక్రీకరించింది? వంటి అంశాలపై ఫోకస్ పెట్టి అసలు విషయాన్ని దాట వేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీకే నష్టం. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని గ్రహించి అప్రమత్తం కావడమే ఉత్తమం.

చంద్రబాబు చక్కదిద్దాలి…

అదికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నట్టుగా మారింది చంద్రబాబు నాయుడి పరిస్థితి. నిజమే . ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. మూడుసార్లు గద్దెనెక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన రికార్డు చరిత్ర పుట్టలో పదిలం. దానినెవరూ తిరగరాసే అవకాశమే లేదు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన పేరునూ ఎవరూ పక్కన పెట్టలేరు. కానీ ప్రజలు అధికారం నుంచి పక్కన పెట్టారు. అనువుగాని చోట, అనుకూలంగా లేని వేళ అధికులమనరాదు. కానీ చంద్రబాబు తానింకా జగన్ మోహన్ రెడ్డి కంటే చాలా గొప్పవాడినని ప్రజలకు చెప్పేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. పది సంవత్సరాలకు పైగా జగన్ మోహన్ రెడ్డిని చూస్తున్నారు. నలభై సంవత్సరాలుగా రాజకీయవేత్తగా చంద్రబాబు శైలి సైతం ప్రజలకు తెలిసిందే. అందువల్ల కొత్తగా వారికి చెప్పాల్సిందేమీ లేదు. జగన్, చంద్రబాబు పాలనలను పోల్చి చూసుకుని ప్రజలే వచ్చే ఎన్నికల్లో తీర్పు చెబుతారు. దానిపై చంద్రబాబు హైరానా పడటం అనవసరం. వైసీపీని ప్రజల్లో ఎలా చులకన చేయాలనే దానిపై దృష్టి తగ్గించి పార్టీలో మొదలైన లుకలుకలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. చివరి క్షణం వరకూ పోరాడే తత్వం, కష్టించే నాయకత్వ పటిమ చంద్రబాబుకు అసెట్. తిరుపతి వంటి ఉప ఎన్నికలో ఆయన పగలు, రాత్రి తన వయసు, హోదాను విస్మరించి సాధారణ నాయకుని మాదిరిగానే కలియతిరుగుతున్నారు. ఇది కచ్చితంగా పార్టీలో ఆయన నాయకత్వంపై నమ్మకం పెంచుతుంది. కానీ తర్వాత తరం నాయకత్వంపైనే ఆరోపణలు, విమర్శలు పెరుగుతున్నాయి. దానిని కంట్రోల్ చేయలేకపోతే దృతరాష్టుని పోలికను చంద్రబాబుకు అంటగట్టే ప్రమాదమూ ఉంది. టీడీపీ అధినాయకత్వం వాడుకుని వదిలేస్తుందనే బావన క్యాడర్ లో నెలకొందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారే చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఒక విచారణకు సంబంధించి సీఐడీ పిలిస్తేనే స్టే తెచ్చుకున్నారు. జిల్లాల్లో కార్యకర్తలపై వేల కేసులు నమోదవుతున్నాయి. వారికి పార్టీ పరంగా న్యాయసహాయం, అండ అందడం లేదు. అటువంటి సందర్బాల్లోనే పార్టీపై తీవ్రమైన అసహనం నెలకొంటుంది. చంద్రబాబు నాయుడి విషయంలో పార్టీ ఏవిధంగా స్పందించిందో, జిల్లాల్లోని నాయకుల కేసుల విషయాన్ని కూడా అంతే తీవ్రంగా తీసుకుని రక్షణగా నిలవాలి. అప్పుడే నాయకత్వంపై మరింత నమ్మకం పెరుగుతుంది.

లోక్ నాయక్ లొంగుతాడా..?

టీడీపీ వారసుడు లోకేశ్ ఇంతవరకూ తన నాయకత్వ సామర్త్యాన్ని నిరూపించుకున్న ఒక సంఘటన కూడా కనిపించదు. భవిష్యత్తులో పార్టీని ఆయన సమర్థంగా ముందుకు తీసుకెళతాడన్న నమ్మకమూ క్యాడర్ లో కనిపించడం లేదు. అయినప్పటికీ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడని లోకేశ్ పై విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న ద్వితీయశ్రేణి నాయకత్వంలోనూ, కార్యకర్తల్లోనూ అసహనానికి ఇదొక కారణంగా నిలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ మాటే చెల్లుబాటయ్యింది. ప్రతిపక్షంలోనూ ఆయన చెప్పినట్లే పార్టీ నడుస్తోంది. స్థానిక నాయకత్వాలకు స్వేచ్ఛ కరువైంది. ఫలితంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో అందరూ చేతులెత్తేశారని విమర్శలు వినవస్తున్నాయి. లోకేశ్ పార్టీ వ్యవహారాల్లో అనుభవజ్ణుడు కాదు. అలాగని ప్రజలను ఆకర్షించగల మాస్ పుల్లింగ్ కరిష్మాటిక్ నాయకుడు కూడా కాదు. ఈ రెండు లక్షణాల్లో ఏ ఒక్కటి లేకుండా కొత్త నాయకత్వాన్ని తమపై రుద్దుతున్నారని పార్టీలో సీనియర్లు వాపోతున్నారు. పార్టీకి విదేయుడైన అచ్చెన్నాయుడు యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్య దీనికి అద్దం పడుతోంది.

వైసీపీ ఓవరాక్షన్…

పరిపాలనపై దృష్టి పెట్టి లోపాలను కనిపెట్టి ప్రజలను సంతృప్తి పరిస్తే వైసీపీకి మంచి పేరు వస్తుంది. ప్రతిపక్షం లోపాలపైనే నిరంతరం నిఘా పెట్టడం అధికారపార్టీ బలహీనతనే బయటపెడుతుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై కూడా వైసీపీలో చాలా మంది నాయకులకు అసంతృప్తి ఉండేది. తమను కలుపుకుని పోవడం లేదని, ఇలాగైతే పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఆంతరంగికంగా వ్యాఖ్యానిస్తుండేవారు. అది పెద్ద విషయం కాదు. 2014లో అధికారం చేతి వరకూ వచ్చి నోటికి దక్కలేదనేదే వారి ఆక్రోశం. అందుకే కొందరు ఎమ్మెల్యేలు జంప్ అయిపోయి అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు వైసీపీ అదిష్ఠానంపై బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. వీర విధేయుడైన అచ్చెన్నాయుడు ఇప్పటికే అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. అయినా ఎప్పుడూ బహిరంగంగా చంద్రబాబు నాయుడిని, పార్టీని విమర్శించలేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం అసహనానికి అద్దం పడుతున్నాయే తప్ప అవిధేయత చాటడం లేదు. తెలుగుదేశం లో పెద్ద తిరుగుబాటు జరిగిపోతోందన్న రీతిలో అధికారపార్టీ ప్రొజెక్టు చేయడం అతిశయోక్తి. దీనివల్ల వైసీపీకి కలిసొచ్చేదేమీ లేదు. పరిపాలనపై శ్రద్ధ పెడితే దీర్ఘకాలం అవకాశం లభిస్తుంది. ప్రతిపక్షంపై ఫోకస్ పెడితే రాజకీయ పోరు మాత్రమే మిగులుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News