పెద్ద నోరే అచ్చెన్నకు చేటు ?

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడును చూస్తే చంద్రబాబుకు ఎంతో భరోసా. ధైర్యం. ఆయన భారీ ఆకారమే కాదు. [more]

Update: 2020-06-07 14:30 GMT

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడును చూస్తే చంద్రబాబుకు ఎంతో భరోసా. ధైర్యం. ఆయన భారీ ఆకారమే కాదు. మాట తీరు, గర్జించే గొంతుక ఇవన్నీ బాబుకు ఒక అండ. అచ్చెన్నాయుడుకు అందుకే బాబు ఏరి కోరి పదవులు ఇస్తూంటారు. ఎక్కడైనా సమస్య ఉంటే అచ్చెన్ననే అక్కడికి పంపుతారు. అది నిన్నటి విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మీద విచారణ కమిటీకి సారధ్యం అయినా, జగన్ మీద పోరాటం అయినా ముందుగా బాబు పక్కన అచ్చెన్న ఉండాల్సిందే. ఇదే ఊపులో అచ్చెన్నాయుడు సమర్ధతను వీర విధేయతను మెచ్చి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేద్దామని బాబు ఉబలాటపడుతున్నారు. కానీ అచ్చెన్నాయుడుకు అదే పెద్ద నోరు ఇపుడు మైనస్ అవుతోందిట.

అలా వ్యతిరేకత….

పార్టీలో బాబు ఇదే విషయం చర్చించినపుడు చాలా మంది అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా తమ వాణిని వినిపించారని టాక్. అచ్చెన్నకు ఇంత వ్యతిరేకత పార్టీలో ఉందా అని బాబు ఆశ్చర్యపోయారట. నిజానికి అచ్చెన్నాయుడుకు బాబు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి కొందరు తమ్ముళ్ళు అసూయపడుతున్నారన్నది కూడా వాస్తవం. అదే సమయంలో వారు కొన్ని నిజాలు కూడా బాబుకు చెప్పారుట. అచ్చెన్నాయుడు పెద్ద నోరు మంచిదే కానీ ఆయన అకారణంగా నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన సందర్భాలు మంత్రిగా చాలా ఉన్నాయని. అలాంటి ఆయన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ముందు పెడితే కొంప కొల్లేరు అవుతుందని బాబుకు విడమరచి మరీ చెప్పరుట.

జగన్ కే ప్లస్…..

అచ్చెన్నాయుడుకు పార్టీలో పెద్ద పదవి ఇస్తే అది అటు తిరిగి, ఇటు తిరిగి జగన్ కే మేలు చేస్తుందని కూడా పార్టీలో అభిప్రాయం వ్యక్తం అయిందని చెబుతున్నారుట. జగన్ ని గట్టిగా నోరు పెట్టి విమర్శలు చేసే అచ్చెన్న అదే టైంలో తన నోటి దురుసుతో తరచూ అడ్డంగా దొరికిపోతూంటాడని కూడా తమ్ముళ్లు అంటున్నారుట. అచ్చెన్నాయుడుకు ఇప్పటికే టీడీపీ శాసనసభా పక్ష ఉప నాయకుడి పదవి ఉందని, ఆయనకే మరిన్ని పదవులు ఇవ్వడం వల్ల పార్టీకి కూడా ఇబ్బంది అవుతుంది అని నేతలు బాబుకు చెబుతున్నారుట. దాంతో బాబు పునరాలోచనలో పడ్డారని టాక్.

కళాకు ఊపిరి….

ఇక తనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి మరోసారి రాదని కళా వెంకట్రావుకు ఎటూ తెలుసు. అయితే తన సొంత జిల్లాకే చెందిన పార్టీలో ప్రత్యర్ధి అచ్చెన్నాయుడు ఏకంగా తన కుర్చీ లాగేస్తే కళాకు తట్టుకోవడం కష్టమే. అందుకే ఆయన ఈ తెర వెనక మంత్రాంగం నడిపించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా అచ్చెనాయుడుకి పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వరాదని బాబు ఇపుడు డిసైడ్ కావడంతో కళా వర్గంలో ఆనందం కనిపిస్తోందిట. ఇక అచ్చెన్నకు బదులుగా పార్టీలో నోటి ధాటితో పాటు విచక్షణ, సమయస్పూర్తి చూపించే ధీటైన బీసీ నేత వేటలో బాబు ఉన్నారని టాక్. మొత్తానికి పార్టీ పెద్ద పదవి వచ్చినట్లే వచ్చి జారిపోవడంతో అచ్చెన్నాయుడు వర్గానికి అసంతృప్తిగా ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News