పార్టీ చొక్కా ఎప్పటికైనా ప్రమాదమే

సర్కారీ ఉద్యోగాలు చేసేవారు తరతమ భేదాన్ని విడనాడి నిష్పక్షపాతం గా మెలగాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల నుంచి పన్నుల రూపేణా వచ్చే జీతాన్ని వారి [more]

Update: 2020-02-10 09:30 GMT

సర్కారీ ఉద్యోగాలు చేసేవారు తరతమ భేదాన్ని విడనాడి నిష్పక్షపాతం గా మెలగాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల నుంచి పన్నుల రూపేణా వచ్చే జీతాన్ని వారి సేవలకు వినియోగించాలి కానీ ఏలికల పార్టీల కోసం పనిచేస్తే భంగపాటు తప్పదు. అయితే నేడు వ్యవస్థ లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అధికారులు సైతం భజనపరులుగా అధికార పార్టీ భక్తులుగా మారిపోయి బాకాలు ఊదుతున్నారు. అందుకోసం తమ కులాన్నో మతాన్నో అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రుల నుంచి, మంత్రులవరకు సన్నిహితులుగా మెలుగుతూ అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. చలిమంట కాగినంతగా వుండాలిసిన సంబంధాలు మరీ దగ్గర కావడంతో ప్రభుత్వాలు మారినప్పుడు వారి స్థానాలు మారిపోవడమే కాదు ఉద్యోగాలు సైతం ఎగిరి పోతున్నాయి. ఇలా ముప్పు తెచ్చుకునే వారిలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు కూడా ఉండటం ఆందోళన కలిగించే పరిణామమే.

కృష్ణ కిషోర్, ఏబీ లను చూస్తే …

ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్, ఏబీ వెంకటేశ్వర రావు ల ఉదంతాలు గమనిస్తే ఉద్యోగులకు గుణపాఠాలు చెప్పక చెబుతాయి. ప్రభుత్వాధినేతలతో అత్యంత సన్నిహితత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక వారికి శాపంగా పరిణమించింది. కృష్ణ కిషోర్ వ్యవహారం కోర్టు మెట్ల వరకు నడిచింది. టిడిపి సర్కార్ హయాంలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన వీరి జమానా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినవెంటనే సిత్రంగా మారిపోయింది. కేంద్ర సర్వీసులకు పోతామని వారు అభ్యర్ధించినా గతంలో వీరు సాగించిన దందాలపై విచారణ ముగిశాకే వదిలేస్తామంటూ సర్కార్ గర్జిస్తోంది.

సిగ్గులేకుండా పార్టీ చొక్కా తొడిగేస్తే …

చంద్రబాబు సర్కార్ 2014 లో కొలువు తీరగానే ఐపీఎస్ క్వార్ట్రర్స్ లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారని గతంలోనే బయటకువచ్చింది. ఇక ఏబీ వెంకటేశ్వరా రావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఒక వెలుగు వెలిగారు. ఆయన గీసిన గీత చంద్రబాబు దాటేవారే కాదన్న టాక్ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు పోలీస్ వర్గాల్లో ఉండేది. అలాంటి ఏబీ ఇప్పుడు నిండా చిక్కుల్లో పడ్డారు. ఆయన కుమారుడు కంపెనీ పేరుతో విదేశాలనుంచి కొనుగోలు చేసిన పరికరాల్లో స్కామ్ జరిగిందన్న కేసు ఇప్పటికే బుక్ అయ్యింది. ఆయన సస్పెండ్ అయ్యి విజయవాడ దాటి బయటకు వెళ్లరాదన్న ఆంక్షల్లో చిక్కుకున్నారు.

భయం లేకపోవడమే…?

ఇలా అనేక ఉదంతాల్లో అధికారులు పార్టీల చొక్కాలు తోడుగేసుకుని ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. దీనికి వైసిపి అనుకూల అధికారులేమి అతీతంకాదు. అయితే వచ్చే ప్రభుత్వం మారితే తమను గుర్తుపెట్టుకుని టార్గెట్ చేస్తారన్న భయం భక్తి లేకుండా పోవడమే ప్రస్తుతం ఇలాంటివారి దుస్థితికి కారణం అనే చెప్పాలి. ఈ తరహా పోకడ వీడితే కానీ వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఈ అధికార భజన బృందం భవిష్యత్తు ముప్పు తలచుకుని భయపడాలంటే మరికొందరు ఇలాంటి అధికారుల ఉదంతాలు కళ్ళముందు కనిపించాలిసి ఉంటుంది.

Tags:    

Similar News