ఫోకస్ పెట్టి… కొట్టి చూపించి..?

సైద్దాంతిక జాతీయవాదమే ప్రత్యామ్నాయమని భావిస్తున్న తరుణంలో, నగదు పంపిణీ సంక్షేమాలే విజయాలను శాసిస్తాయని ఆశిస్తున్న సమయంలో ఢిల్లీ ఓటరు భిన్నమైన తీర్పు చెప్పాడు. అటు జాతీయవాద ముసుగుకు, [more]

Update: 2020-02-11 15:30 GMT

సైద్దాంతిక జాతీయవాదమే ప్రత్యామ్నాయమని భావిస్తున్న తరుణంలో, నగదు పంపిణీ సంక్షేమాలే విజయాలను శాసిస్తాయని ఆశిస్తున్న సమయంలో ఢిల్లీ ఓటరు భిన్నమైన తీర్పు చెప్పాడు. అటు జాతీయవాద ముసుగుకు, ఇటు సంక్షేమ వాద అత్యుత్సాహానికి జవాబు చెప్పాడు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అనుచితమైన పథకాలు ప్రవేశపెట్టి సర్కారీ సొమ్మును పంచిపెట్టి పునరధికారం సాధిస్తున్నాయి. జాతీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారం తెచ్చుకోవాలని చూస్తున్నాయి. ఈరెండూ సరైన విధానాలు కాదని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం నిరూపించింది. జాతీయపార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన పక్షంగా సర్వశక్తులు మోహరించినా బీజేపీ బోర్లా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి విజయం సాధించింది. 2013 కొద్దికాలం పాటు మాత్రమే చెలాయించిన అధికారాన్ని మినహాయిస్తే ఇప్పుడు సొంతకాళ్లపై రెండోసారి రికార్డు స్థాయి లో గెలిచింది.

గెలుపులో మలుపు…

ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలవడం అనేది పెద్ద విషయం కాదు. కొనసాగుతున్న ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను తట్టుకొని విజయం సాధించడం కూడా అసాధారణం కాదు. కానీ విజయం సాధించడానికి అనుసరించిన సూత్రం మాత్రం ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చింది. సంక్షేమం అంటే డబ్బుల పంపిణీ కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాల ద్వారా ఓటరు మనసు గెలుచుకోవడం గొప్ప విషయం. అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే ఒక ప్రయోగం. ధనస్వామ్యం , వారసత్వం కాకుండా సామాన్యులు, విద్యావంతులను తెచ్చి ఎన్నికల్లో పోటీ చేయించిన ఘనత కూడా ఆపార్టీకి దక్కింది. స్వాతంత్ర్యం పూర్వం నుంచి పాతుకుపోయిన కాంగ్రెసు, సమర్థ నాయకత్వంతో దూసుకువచ్చిన బీజేపీ చేయని సాహసాలు ఎన్నో ఆప్ చేసింది. 2013, 2015 కంటే ఈ విజయం కచ్చితంగా ఆప్ కి సంబంధించి మరో మలుపు. 2013లో నేరుగా ఆందోళనల నుంచే పార్టీగా రూపుదాల్చి రెండో అతిపెద్ద పార్టీగా నిలిస్తే 2015లో సానుభూతి తోడై 67 స్థానాలతో బీజేపీ, కాంగ్రెసులను తునాతునకలు చేసేసింది. ఇప్పుడు తన పాలనపై తీర్పుగా తాజా విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ ఫలితాల నుంచి జాతీయ, ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవలసినది చాలా ఉంది.

దిశ మారిన సంక్షేమం…

అడిగినా, అడగకపోయినా ప్రజలకు వివిధ రూపాల్లో సంక్షేమం పేరిట నగదు పంపిణీ చేయడం ప్రాంతీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి సంక్షేమం పేరిట అనుచిత, అయాచిత పథకాలను ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా కులపరమైన సమీకరణలు సైతం ప్రాంతీయపార్టీల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ఓటుకు కనీసం రెండువేల నోటు అన్న పద్దతిని ఆయా పార్టీలు పాటిస్తున్నాయి. వీటికి ఆమ్ఆద్మీ పార్టీ వీడ్కోలు పలకడం గమనించదగ్గ అంశం. ఈ పార్టీ హయాంలో కూడా సంక్షేమానికే పెద్ద పీట వేశారు . కానీ రూపం మార్చారు. మొహల్లా క్లినిక్ ల పేరిట వైద్యాన్ని పేదలకు వాడవాడలా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ , మునిసిపల్ పాఠశాలల్లో వసతులు మెరుగు పరిచి విద్యాప్రమాణాలు పెంచారు. అలాగే రెండువేల లీటర్ల వరకూ ఉచిత నీరు, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు సరఫరాతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదం చేశారు. ఇవన్నీ సామాజిక సంక్షేమం , పేదల స్థితిగతుల మెరుగుదలకు ఉపకరించాయి.

ఖర్చు పెట్టకుండానే…

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు కనీసం పదికోట్ల రూపాయల మేరకు ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్థితి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయింది. పోటాపోటీ ఓట్ల కొనుగోళ్లతో ఎన్నికలు ఖరీదైన వ్యవహారమైపోయింది. దేశ రాజధాని ఢిల్లీ , కీలకమైన రాజకీయ క్షేత్రం. మినీ ఇండియా. ఇక్కడ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు చాలా వరకూ కోటి రూపాయల లోపు వ్యయం మాత్రమే చేశారనేది అంచనా. ఇది ప్రాంతీయ పార్టీలు తెలుసుకోవాల్సిన నిజం. పరిపాలన తీరు ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలి. ఓట్ల కొనుగోళ్లు, పథకాల రూపంలో నగదు పంపిణీలు దీర్ఘకాలంలో రాష్ట్రాల భవిష్యత్తును దెబ్బతీస్తాయి. ప్రజలకు కల్పించే ప్రయోజనం జీవన ప్రమాణాలు పెంచేదిగా ఉండాలి. ఢిల్లీ సర్కారులో ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరించిన మోడల్ ఆదర్శప్రాయమనే చెప్పాలి. అందుకే బీజేపీ ఇచ్చిన హామీలను, భారీ ప్రచారాన్ని తిరస్కరిస్తూ మరోసారి ఢిల్లీ ఓటరు ఆప్ ను గద్దె నెక్కించాడు.

జాతీయ పార్టీలు…

పేరుగొప్ప జాతీయ పార్టీలు సిద్దాంతం పేరిట ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుతున్నాయి. కాంగ్రెసు ఇప్పటికీ మైనారిటీల బుజ్జగింపు సూత్రంతో ఓట్లను పోలరైజ్ చేసుకునే పద్దతులను వీడటం లేదు. బీజేపీ హిందుత్వను ప్రబోధిస్తూ మెజార్టీ ప్రజలను పార్టీకి అనుకూలంగా సంఘటితం చేసుకోవాలని చూస్తోంది. ఇవి రెండూ తప్పుడు విధానాలే. ఈ రెండు పార్టీల విధానాలకూ దూరంగా ఉండేందుకు ఆమ్ ఆద్మీపార్టీ ప్రయత్నించింది. ప్రజలకు అవసరమైన కనీస అంశాలపైనే తన ఫోకస్ నిలిపింది. తొలిదశలో కేంద్రంతో, నరేంద్రమోడీతో వ్యక్తిగతంగా తలపడేందుకు ప్రయత్నించిన కేజ్రీవాల్ తన ధోరణిని మార్చుకున్నారు. జాతీయ ఎన్నికల్లో బీజేపీకి లభిస్తున్న మద్దతును దృష్టిలో పెట్టుకుని తన వైఖరిని తాను సవరించుకున్నారు. ఆప్ గెలుపులో అది కూడా కీలక అంశమే. భారీ ఖర్చు లేకుండా , ప్రజల దైనందిన జీవనం, సమస్యలే ప్రాతిపదికగా వెలువడిన ఢిల్లీ తీర్పు ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగిన పరిణామం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News