ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ అదే నా ?

ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే టార్గెట్ పెట్టుకున్నారు. అది ఆయన సాధిస్తారో లేదో తెలియదు కానీ ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో మొదలు పెట్టేశారు. [more]

Update: 2019-06-15 06:30 GMT

ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే టార్గెట్ పెట్టుకున్నారు. అది ఆయన సాధిస్తారో లేదో తెలియదు కానీ ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో మొదలు పెట్టేశారు. అదే ఎపికి ప్రత్యేక హోదా సాధన. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా లేక ప్రధానిని కానీ ఇతర ముఖ్యులను కానీ ఏ సందర్భంలో కలిసినా జేబులో రెడీ గా పెట్టుకున్నా హోదా అభ్యర్ధన కాపీ వారికి అందిస్తూ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు జగన్. విక్రమార్కుడు చెట్టు నుంచి కిందకి దించాకా కథ చెప్పి భేతాళుడు తిరిగి చెట్టు ఎక్కుతున్న విధంగానే హోదా సాధించడం అంత ఆషామాషీ వ్యవహారం కానే కాదన్నది జగన్ కి పూర్తిగా అర్ధమైంది. అయినా విక్రమార్కుడిలా పోరాడితే పోయేదేముందన్న వ్యూహంతో అదే ప్రయత్నంలో పడ్డారు ఎపి సీఎం. కేంద్రంలోని మోడీ సర్కార్ కి పూర్తి స్థాయిలో వున్న మెజారిటీ నేపథ్యంలో ఎపి మద్ధత్తుకోసం ఆయన వెంపర్లాడలిసిన పనిలేదు. ప్రస్తుతం హోదా సాధనలో ఈ అంశమే కేంద్రం పట్టించుకోకపోవడానికి కారణం అవుతుంది.

షా ను కలిసిన ముఖ్యమంత్రి ...

ఎపి హోదా అంశం తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దృష్టికి మరోసారి తెచ్చారు ముఖ్యమంత్రి జగన్. మోడీ మనసు మార్చి ఈ కోరికను మన్నించేలా సహకరించాలని ఆయన అభ్యర్ధించారు. నేడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఐదు నిమిషాల సమయం ఎపి సిఎం కు లభించనుంది. ఆ సమయాన్ని వినియోగించుకోనున్నారు జగన్. ప్రధాని ముఖ్యమంత్రులు అత్యున్నత అధికార బృందం పాల్గొనే ఈ వేదికలో జగన్ ప్రస్తావించే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్యాకేజ్ బాబు చట్టబద్ధం చేశారంటున్న పీయూష్ గోయల్ …

ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమే అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాజాగా చేసిన వ్యాఖ్య దుమారమే రేపుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన ఎపి స్పెషల్ స్టేటస్ అంశంపై విభిన్నంగా స్పందించారు. హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజ్ చాలని అంగీకరించి ఎపి అసెంబ్లీ సాక్షిగా చర్చించి ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి చట్టబద్ధం చేశారని గత ప్రభుత్వ విధానాలను తరువాత ప్రభుత్వం గౌరవించాలని ఉచిత సలహా ఇచ్చారు గోయల్. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఇచ్చిన హామీని అమలు చేయని బిజెపి నేతృత్వంలోని మోడీ సర్కార్ ఈ మాట చెప్పడం విడ్డురంగా ఉందన్న విమర్శలు కమలనాధులపై వెల్లువెత్తుతున్నాయి.

అదే కావాలంటే పరిశీలిస్తాం ….

ఎపికి ఏమి అఖ్ఖర్లేదు ప్రత్యేక హోదానే కావాలంటే ప్రధాని పరిశీలనకు ఈ అంశాన్ని తీసుకువెడతామని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఈ అంశం బలంగా ఉంటే ప్రధాని తప్పక ఆమోదించే అవకాశం ఉందని సోము చెప్పడం గమనిస్తే రానున్న రోజుల్లో కమలం ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకైనా హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే గత సర్కార్ లా కాకుండా హోదా అంశంపై అఖిలపక్షం తో తరచూ ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న సూచనలు పలువురి నుంచి వినవస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎపి లో తిరిగి ప్రజల సానుభూతి పొందేందుకు హోదాపై తొలి సంతకాన్ని పెడతామన్న హామీ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోగా బిజెపి సర్కార్ ఈ అంశానికి తెరదించి ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ లేకుండా చేసే అవకాశం వుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి కేంద్రం భవిష్యత్తులో ప్రత్యేక హోదా పై ఎలాంటి కార్యాచరణ చేపడుతుందో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News