ల‌క్ష్యం బాగుంది.. ఈయనతో క‌లిసేదెవ‌రు..?

బీద ర‌విచంద్ర. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. ఒకే పార్టీలో దాదాపు 20 ఏళ్లుగా ఆయ‌న ఉన్నారు. త్వర‌లోనే బీద‌కు రాష్ట్ర స్థాయిలో మ‌రో కీల‌క ప‌ద‌వి ప‌గ్గాలు [more]

Update: 2020-10-23 13:30 GMT

బీద ర‌విచంద్ర. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. ఒకే పార్టీలో దాదాపు 20 ఏళ్లుగా ఆయ‌న ఉన్నారు. త్వర‌లోనే బీద‌కు రాష్ట్ర స్థాయిలో మ‌రో కీల‌క ప‌ద‌వి ప‌గ్గాలు ఆయ‌న‌ చేప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలలో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రక‌ట‌న చేయ‌నున్నారు. ఈ క్రమంలో బీద ర‌విచంద్ర త‌న మ‌న‌సులో మాట వెల్లడించారు. “సమర్థులను పార్టీలోకి ఆహ్వానిస్తా. కొత్త రక్తంతో.. కొత్త ఉత్సాహంతో పార్టీని ముందుకు నడిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా.“ ఇది ఆయ‌న చెప్పిన మాట‌.

ఇరవై ఏళ్లపాటు……

పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 20 ఏళ్లపాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రవిచంద్ర జిల్లా పరిధిని దాటి రాష్ట్ర పార్టీ వైపు అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చేదెవ‌రు? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. నిజానికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో అంద‌రినీ స‌మ‌న్వయం చేయ‌లేక పోయార‌నే పెద్ద విమ‌ర్శను ర‌విచంద్ర ఎదుర్కొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా 12 ఏళ్లు పనిచేసిన 2012 నుంచి అధ్యక్షుడిగా కూడా చక్రం తిప్పుతున్నారు.

రెండు ఎన్నికలు ఆయన…..

దాదాపు రెండు ఎన్నిక‌లు ఆయ‌న హ‌యాంలోనే జ‌రిగాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో నెల్లూరులో టీడీపీ ప‌రుగులు పెట్టిందా? ప‌డ‌కేసిందా? అంటే.. రెండో మాటే వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అయితే టీడీపీ నెల్లూరు జిల్లాలో సున్నా చుట్టేసింది. అనేక మంది కీల‌క నాయ‌కులు పార్టీలోకి వ‌చ్చారు. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటి ఉద్ధండులు సైతం సైకిల్ ఎక్కారు. వీరిలో ఎవ‌రూ గ‌త ఎన్నిక‌లనాటికి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది నిజంగానే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ర‌విచంద్రను కార్నర్ చేసింది.

సొంత పార్టీ నుంచే……

ఇక‌, రెండు ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. పార్టీలో కుమ్ములాట‌లు పెరిగాయి. పైగా త‌న వ్యక్తిగ‌త ఇష్టాల‌కే విలువ ఇస్తార‌ని, పార్టీని న‌మ్ముకున్న వారికి అవ‌కాశం ఇవ్వర‌ని కావ్య కృష్ణారెడ్డి వంటివారు తీవ్రంగా విమ‌ర్శలు గుప్పించారు. ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి సైతం.. పార్టీకి జిల్లాలో అధ్యక్షుడు ఉన్నారా ? అంటూ.. కామెంట్లు కుమ్మరించిన సంద‌ర్భాలున్నాయి. ఇక‌, సోమిరెడ్డి చంద్రమోహ‌న్ క‌నుస‌న్నల్లో న‌డుస్తార‌నే విమ‌ర్శ కూడా ఉంది. ఆయ‌న ఓ విఫ‌ల‌మైన నాయ‌కుడు అంటూ.. స్థానికంగా త‌మ్ముళ్లు విమ‌ర్శలు చేస్తూనే ఉన్నారు.

బ్రదర్ వైసీపీలోకి…..

ఇక ఆయ‌న సొంత అన్న మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం కావలిలోనే పార్టీ రెండు సార్లు ఓడిపోవ‌డం బీద‌ రవిచంద్రకు పెద్ద మైన‌స్‌. స‌రే! ప‌రిస్థితులు అన్నీ అలానే ఉండ‌వు కాబ‌ట్టి.. రాష్ట్ర స్థాయిలో పార్టీ ప‌రంగా బాధ్యత‌లు చేప‌ట్టాక‌.. ఎలా వ్యవ‌హ‌రిస్తారోన‌నేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. బీసీ వ‌ర్గాల‌ను స‌మీక‌రించి.. వారి ఓటు బ్యాంకును టీడీపీకి అనుకూలంగా మార్చడం వంటివి బీద‌కు స‌వాలుగా మార‌నున్నాయి. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో ? చూడాలి.

Tags:    

Similar News