హైకోర్టు తీర్పు పైనే అందరి చూపు ?

ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఒక సందిగ్ద పరిస్థితి కొనసాగుతోంది. జగన్ సర్కార్ అమరావతిని మూడు వంతులు చేస్తూ తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం ఇది. ఏపీ [more]

Update: 2021-01-13 15:30 GMT

ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఒక సందిగ్ద పరిస్థితి కొనసాగుతోంది. జగన్ సర్కార్ అమరావతిని మూడు వంతులు చేస్తూ తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం ఇది. ఏపీ ప్రజలకు ఒక రాజధాని అన్నది ఇప్పటిదాకా ఉంది అంటే లేదు అని బదులు వస్తుంది. అయితే పేరుకు అమరావతి అని అంటున్నా న్యాయ వ్యాజ్యం నడుస్తున్నపుడు దాన్ని కూడా చెప్పడానికి లేదు. న్యాయమూర్తులు ఏ తీర్పుని చెబితే దానికి బట్టి ఏపీకి రాజధాని అన్నది తెలుస్తుంది. అంతే కాదు, ఏపీలోని అయిదు కోట్ల ప్రజలలో ఉన్న అయోమయం కూడా తొలగిపోతుంది.

అప్పటికి పూర్తి అవుతుందా..?

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల బిల్లుల మీద విచారణ రోజు వారీ పద్ధతిలో సాగుతోంది. అయితే ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి మహేశ్వరి బదిలీ మీద వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త ప్రధాన న్యాయమూర్తి గోస్వామి నియమితులయ్యారు. ఆయన ఈ కేసుని విచారించాల్సి ఉంది. మరి మొదటి నుంచి ఈ కేసు పూర్వపరాలు తెలుసుకుని విచారిస్తే మరింతగా లేటు అవుతుంది అంటున్నారు. అలా కాకుండా ఈ కేసును ఇప్పటిదాకా విచారించిన దానినే కంటిన్యూ చేస్తే మాత్రం మరో మూడు నెలలకు తీర్పు రావచ్చు అంటున్నారు.

నమ్మకంతోనేనా…?

ఏపీలో మూడు రాజధానుల కధ ఈ ఏడాది మొదట్లోనే తెములుతుందా అన్న డౌట్లు ఉన్నాయి. జగన్ వరకూ చూసుకుంటే కొత్త విద్యా సంవత్సరం మొదలు కాకముందే విశాఖకు షిఫ్ట్ కావాలన్నది వైసీపీ సర్కార్ ఆలోచన. దానికి సచివాలయం ఉద్యోగులను మానసికంగా సిధ్ధం చేసి ఉంచారు. వారు ఎపుడైనా విశాఖకు వెళ్ళేందుకు మేము రెడీ అంటున్నారు. మరి కొత్త తెలుగు సంవత్సరం వేళ రాజధాని మార్పు ఉంటుందని మంత్రులు హింట్లు ఇస్తున్నారు. అది నిజం కావాలంటే తీర్పు రావాలి. మరో వైపు మూడు రాజధానుల చట్టం విషయంలో హై కోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ముందు హైకోర్టు తీర్పుని చూడమనే సూచించింది. దాంతో ఇపుడు అందరి దృష్టి హైకోర్టు తీర్పు మీదనే ఉంది.

తీవ్ర ప్రభావం…..

ఏపీ రాజకీయాలు ఇపుడు మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి రాజధానిగా కనుక తీర్పు వస్తే రాజకీయం ఒకలా ఉంటుంది. అది చంద్రబాబుకు అనుకూలంగా మారి తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తే జగన్ కి ఇక తిరుగు ఉండదు. అపుడు చంద్రబాబుకు రాజకీయ వనవాసం మరింతకాలం కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏపీ ప్రజలకు కూడా రాజధాని మీద ఏదో ఒక తీర్పు వస్తే క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది. మరి కొత్త ఏడాదిలో తొందరగా ఈ అతి ముఖ్యమైన విషయంలో ఏదో ఒకటి తేలాలన్నది కోట్లాది మంది జనాల కోరికగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News