118 మూవీ రివ్యూ

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ నటీనటులు: కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేత థామస్, నాజర్, హరితేజ, రాజీవ్ కనకాల, ప్రభాస్‌ శీను తదితరులు సినిమాటోగ్రఫీ: [more]

Update: 2019-03-01 08:01 GMT

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ
నటీనటులు: కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేత థామస్, నాజర్, హరితేజ, రాజీవ్ కనకాల, ప్రభాస్‌ శీను తదితరులు
సినిమాటోగ్రఫీ: కె వి గుహన్
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు
డైరెక్టర్: కె. వి. గుహన్

పది పదమూడేళ్లలో రెండే రెండు హిట్స్ ని సొంతం చేసుకుని… ఫ్లాప్స్ వచ్చినా బెదరకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. భారీ హిట్ కోసం ఇన్నాళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. అతనొక్కడే, పటాస్ సినిమాలు తప్ప కళ్యాణ్ రామ్ చేసిన ఏ సినిమా కూడా ఆడలేదు. మరి కథల ఎంపికలో లోపమో, మంచి గైడెన్స్ ఇచ్చేవారు లేకనో కానీ కళ్యాణ్ రామ్ మాత్రం హిట్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఎమ్యెల్యే, నా నువ్వేతో భారీ డిజాస్టర్లు అందుకున్నాడు. తాజాగా సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకుడిగా మారి కళ్యాణ్ రామ్ తో ఒక కొత్త ప్రయోగం చేసాడు. కళ్యాణ్ రామ్ – నివేత థామస్, షాలిని పాండేతో 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాని నందమూరి హీరోలకు ఫ్యాన్, పరమ భక్తుడు అయిన మహేష్ కోనేరు నిర్మించాడు. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచేసాడు. అందులోనూ తారక్, బాలకృష్ణ కూడా 118 ప్రమోషన్స్ లో పాల్గొనడం, దిల్ రాజు 118 థియేట్రికల్ హక్కులు దక్కించుకోవడంతో సినిమా మీద క్రేజ్ పెరిగింది. మరి హిట్ కోసం అర్రులు చాచిన కళ్యాణ్ రామ్ కి కె.వి గుహాన్ 118 తో అయినా హిట్ ఇచ్చాడా… ? లేదంటే కళ్యాణ్ రామ్ ఫ్లాప్ ల పరంపర అలానే కొనసాగిందా? అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ
జర్నలిస్ట్ అయిన గౌతమ్(కళ్యాణ్ రామ్)కి నిద్రలో ఒక వింత కల ప్రతి రోజు వస్తుంది. ఆ కలలో ఒక అమ్మాయి ఆద్య(నివేత థామస్) అనుమానాస్పదంగా మరణిస్తుంది. అయితే కలలో వచ్చిన విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి కలల స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ని గౌతమ్ కలుస్తాడు. డాక్టర్ ని కలిసాక గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ (షాలిని పాండే), ఫ్రెండ్ ప్రభాస్ శీనుతో కలిసి ఆద్య మరణం గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతరు. వారు ఆద్య గురించి తెలుసుకునే క్రమంలో ఈస్తర్(హరితేజ) అనే అమ్మాయి కూడా మిస్ అవుతుంది. అయితే గౌతమ్.. ఈస్తర్ మిస్సింగ్ కి, తనకి వచ్చిన కలకి ఏమైనా సంబంధం ఉందా అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటాడు. షాలినితో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ లో గౌతమ్ కు అనేక సమస్యలతో ఎదురవడంతో పాటు.. అనేక క్లూలు కూడా దొరుకుతాయి. అసలు ఈ ఆద్య ఎవరు? ఆమె మరణించి గౌతమ్ కలలో ఎందుకు కనిపించింది? ఆద్య అనే అమ్మాయి నిజంగానే ఉందా? ఆద్య మరణానికి, ఈస్టర్ మిస్సింగ్ కి గల సంబంధం ఏమిటి? గౌతమ్ ఈ మిస్టరీని ఎలా చేదించాడు? అనేదే 118 మిగతా కథ.

నటీనటుల నటన

జర్నలిస్ట్ పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టేసాడు. ఈ సినిమాలో కాస్త డిఫ్రెంట్ లుక్ లో కళ్యాణ్ రామ్ కనిపించాడు. అలాగే ఇదివరకెప్పుడూ చేయని పాత్రలో కనిపించాడు. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా కళ్యాణ్ రామ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. తనకొచ్చే కల విషయంలో వర్రీ అవుతూనే.. దాన్ని ఛేదించే క్రమంలో కళ్యాణ్ రామ్ నటన ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటాపోటీగా నటించినా… ఆద్యగా నివేత థామస్ నటన సినిమాకే హైలెట్. నిడివి తక్కువైన పాత్రలో చేసినా ఎప్పటిలాగే నటనలో నివేత అదరగొట్టేసింది. సినిమాలో కీలక పాత్ర నివేతదే. ఇక మరో హీరోయిన్ షాలిని పాండే.. కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా చూడముచ్చటైన నటనతో ఆకట్టుకుంది. స్పెషల్ డాక్టర్ గా నాజర్, ఈస్టర్ గా మిస్ అయిన అమ్మాయి పాత్రలో హరితేజ ఆకట్టుకున్నారు.

విశ్లేషణ

ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన కె.వి గుహన్ ఈ 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా కోసం గుహాన్ ఎంచుకున్న కాన్సెప్ట్, ఈ సినిమాని నడిపించిన తీరుని మెచ్చుకోవాల్సిందే. ఇక హీరో ఇలాంటి థ్రిల్లర్ సబ్జెట్ కథల్లో కనిపించడం కల్యాణ్‌రామ్‌కి ఇదే తొలిసారి. ఓ కల చుట్టూ సినిమా కథ మొత్తం తిరుగుతుంటుంది. కలలో వచ్చిన ఆధారాలను బట్టి హీరో కళ్యాణ్ రామ్ ఓ అన్వేషణ మొదలు పెడతాడు. కథని ప్రారంభించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో చిక్కుముడినీ విప్పుకొంటూ హీరో ప్రయాణం చేయడం, ఆ ప్రయాణంలో తనకు అనుకోని ప్రమాదాలు ఎదురవ్వడం ఈ కథని మరింత రసకందాయంలో పడేస్తాయి. ఒక జర్నలిస్ట్ గా కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేషన్ చేసే సీన్లు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కడా పట్టు సడలకుండా సాగింది. తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తి కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అనవసరమైన సన్నివేశాలు లేకుండా కేవలం కథపైనే దృష్టి పెట్టడం బాగా కలిసొచ్చింది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ ఇన్వెస్టిగేషన్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లూ కోసం మళ్లీ కళ్యాణ్ రామ్ తనకొచ్చిన కలపైనే ఆదారపడతాడు. కలకు సంబంధించిన సన్నివేశాలన్నీ లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. కలలోకి ఓ మనిషి వెళ్లిపోవడం, అక్కడ జరిగినదంతా చూడడం.. ఇవన్నీ లాజిక్‌ లేని సంగతులే. నివేత థామస్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని చోట్ల డల్ నరేషన్ ఉన్నట్టు అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా మంచి ఆసక్తికరంగా సాగుతుంది.

సాంకేతిక విభాగం పనితీరు

ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీలకం. సన్నివేశాల‌కు త‌గ్గ‌ట్టు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని శేఖర్ చంద్ర ప‌ర్‌ఫెక్ట్‌ గా అందించాడు. అలాగే ఈ సినిమాకి మరో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కె.వి గుహన్ ఈ సినిమాకి అద్భుతమైన ఛాయాగ్రహణం అందించాడు. ఇక ఎడిటింగ్ కూడా ఫర్వాలేదనిపించేలా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త లాగింగ్ సీన్స్ ఉన్నాయి. వాటికి కత్తెర వేస్తె బాగుండేది. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు కూడా కథానుసారంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కథనం, ఫస్ట్ హాఫ్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ రామ్, నివేత థామస్

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ సాగదీత, లాజిక్ లేని సీన్స్, ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్

రేటింగ్: 2.75 /5

Tags:    

Similar News