దీపావళికి ముందే ఉద్యోగులకు ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన యజమాని
హర్యానాలో ఒక ఔషధ తయారీ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది
దీపావళికి తమ సిబ్బందికి భారీ బహుమతులు ఇవ్వడం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. తమ సంస్థ అభివృద్ధికి, లాభాలు రావడానికి కారణమైన ఉద్యోగులకు దీపావళి రోజున అనేక ప్రయివేటు సంస్థలు ఉద్యోగులకు భారీ బహుమతులు ఇస్తుంటాయి. తమకు లాభాలను తెచ్చిపెట్టడంలో ఉద్యోగుల శ్రమ, పనితీరు, వారి అంకిత భావాన్ని గుర్తించి విలువైన బహుమతులు అందచేయడం ఎప్పటి నుంచో వస్తుంది. అందుకే లాభాలు ఆర్జించి పెట్టే సంస్థ ఉద్యోగులు సిబ్బంది దీపావళి కోసం ఎదురు చూస్తుంటారు.
హర్యానాలోని మిట్స్ నేచురా లిమిటెడ్...
తాజాగా హర్యానాలో ఒక ఔషధ తయారీ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. హర్యానాకు చెందిని మిట్స్ నేచురా లిమిటెడ్ దీపావళి నాడు ఉద్యోగులకు, సిబ్బందికి ఖరీదైన కార్లను ఇచ్చి వారిని ఆనందపర్చింది. మిట్స్ నేచురా లిమిటెడ్ యజమాని ఎం.కె. భాటియా దీపావళి పండగకు ముందే ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగుల కళ్లలో ఆనందాన్ని ఆయన చూడగలిగారు. మొత్తం యాభై ఒక్క మంది ఉద్యోగులకు ఈ కార్లను బహుకరించారు. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండేళ్ల నుంచి...
గత రెండేళ్లుగా మిట్స్ నేచురా లిమిటెడ్ సంస్థ యజమాని ఎం. కె. భాటియా తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు రెండేళ్లుగా భారీ బహుమతులు అందిస్తున్నారు. ఈసారి ఖరీదైన కార్లు ఇచ్చి ఉద్యోగలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. దీపావళికి ముందే తమ ఇంట కారు రావడంతో ఉద్యోగులు కూడా ఖుషీ ఫీలవుతున్నారు. ఉద్యోగుల నిజాయితీ, కష్టం, నిబద్ధత వల్ల సంస్థ నిలబడిందని మిట్స్ నేచురా లిమిటెడ్ సంస్థ యజమాని ఎం.కె. భాటియా తెలిపారు. వారికి తాను అందించే చిరు కానుక ఇదేనని అన్నారు.