Diwali 2025 : దీపావళి అంటే తెలియని గ్రామం...పండగ కు దూరం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెం గ్రామంలో ఎవరూ దీపావళిని జరుపుకోరు
దీపావళిని దేశమంతా వేడుకగా జరుపుకుంటారు. నరకాసురుడి వధ జరగడంతో దేశమొత్తం బాణాసంచా కాల్చి పండగ చేసుకుంటుంది. నరకాసురుడు మరణించాడన్న సంతోషంతో దేశమంతా సంబరాలు జరుపుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం మాత్రం దీపావళికి దూరంగా ఉంటుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. రెండు వందల ఏళ్ల నుంచి ఆ గ్రామం దీపావళి వేడుకలకు దూరంగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెం గ్రామంలో ఎవరూ దీపావళిని జరుపుకోరు. అంతేకాదు ఆ గ్రామానికి వచ్చిన కోడళ్లు కూడా పండగకు దూరంగా ఉండాల్సిందే. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే.
రెండు శతాబ్దాలుగా...
దీపావళి పండగకు ఈ గ్రామం దూరంగా ఉండటానికి కారణం కూడా లేకపోలేదు. రెండు శతాబ్దాల క్రితం పాము కాటుతో పున్ననపాలెం గ్రామంలో ఒక బాలిక చనిపోయింది. అలాగే అదే రోజు రెండు ఆవులు కూడా చనిపోయాయి. దీంతో దీపావళి పండగ రోజు అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆరోజు గ్రామంలో దీపావళి పండగను జరుపుకోలేదు. ఇది సెంటిమెంట్ గా భావించిన ఆ గ్రామ ప్రజలు మొత్తం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తమ గ్రామంలో విషాదాన్ని మిగిల్చిన ఘటనతో అరిష్టంగా భావించిన గ్రామస్థులు దీపావళికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో గ్రామ పెద్దలు దీపావళిని జరుపుకోకూడదని నిషేధాన్ని అందరికీ విధించారు.
ఆంక్షలు ఉల్లంఘిస్తే...
ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘించి పండగ జరుపుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. కొన్నేళ్ల క్రితం ఆంక్షలు ఉల్లంఘించి ఒక వ్యక్తి దీపావళి పండగ చేసుకున్నాడు. అయితే ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. దీపావళి పండగను జరుపుకున్న వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత దీపావళిపండగ జరుపుకున్న వ్యక్తి కుటుంబంలో యువతి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి గ్రామస్థులందరూ దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఎవరూ ఆ గ్రామంలో దీపావళి జరుపుకోవడం అనేది జరగదు. కొన్ని తరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ ఆ గ్రామస్థులు పాటిస్తున్నారు. దీపాలు వెలిగించరు. పండగ వాతావరణం కనిపించదు.