Cyber Crime : కొత్తదారుల్లో మోసానికి దిగుతున్న సైబర్ నేరగాళ్లు.. ఫేక్ యాక్సిడెంట్ పేరుతో ట్రాప్

సైబర్ నేరగాళ్లు కొత్త దారులతో మోసగించేందుకు సిద్ధమవుతున్నారు

Update: 2025-10-17 11:55 GMT

సైబర్ నేరగాళ్లు  మోసగించేందుకు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని పెంచడంతో పలు రకాల మోసాలకు నేరగాళ్లు పాల్పడుతున్నారు.తాజాగా హైదరాబాద్ లో ఒక మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. దాదాపు 35.23 లక్షలు పోగొట్టుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ లోని వెంగళరావు నగరానికి చెందిన న 61 ఏళ్ల మహిళను నకిలీ యాక్సిడెంట్‌ కథతో మోసగాడు రూ.35.23లక్షలు ఎగనామం పెట్టాడు. లండన్‌లోని ఒక ఆసుపత్రిలో యూరాలజిస్టుగా పనిచేస్తున్నానని చెప్పుకున్న వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ ద్వారా ఆమెను సంప్రదించాడు.

ప్రమాదానికి గురయ్యాడంటూ...
‘మీ కుమారుడు లండన్‌ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురయ్యాడు. అతని తలకు తీవ్ర గాయమైంది. అతని లగేజ్‌ కనిపించడం లేదు, ఐడీ లేక ఆసుపత్రిలో చేర్చలేకపోతున్నాం. నేను చట్టవిరుద్ధంగా చేర్పించాను, వెంటనే డబ్బు పంపండి’ అని అతను కోరాడు. ఆ మాటలు నమ్మిన మహిళ ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 18వ తేదీల మధ్య ఆన్‌లైన్‌ ద్వారా పలు సార్లు పంపిన మొత్తంగా రూ.35.23లక్షలు సైబర్ నేరగాడు దోచుకున్నాడు. తర్వాత తన కుమారుడి ఫోటో లేదా వీడియో చూపించమని అడగగా, ఆ వ్యక్తి చాట్‌ హిస్టరీ మొత్తం డిలీట్‌ చేశాడు. అప్పుడు ఆ మహిళ తాను మోసపోయానని అర్థమయింది. సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
జాగ్రత్తగా ఉండాలంటూ...
ఇలాంటి నకిలీ యాక్సిడెంట్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు. ఎలాంటి ఆందోళనతో వెంటనే డబ్బులు పంపవద్దని, ముందుగా కుటుంబసభ్యులతో లేదా అధికారిక దౌత్య మార్గాల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలని సూచించారు. అలాగే, ఇతరుల వాట్సాప్‌ కాల్స్‌, లింకులు నమ్మకూడదని, బ్యాంక్‌ వివరాలు పంచకూడదని, మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పోలీస్‌ అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8712665171 నంబర్‌కు కాల్‌ చేయవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నేరగాళ్లు కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పౌరులను కోరారు.


Tags:    

Similar News