AP Politics : వైసీపీ టిక్కెట్ కోసం ఆ లీడర్ చేస్తున్న ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా?

వైసీపీ టిక్కెట్ కు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది.

Update: 2026-01-01 08:55 GMT

వైసీపీ టిక్కెట్ కు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గురునాధ రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తమ కుటుంబం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని గురునాధ రెడ్డి ప్రకటించడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి తిరిగి రీ ఎంట్రీకి ఆయన సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. గత కొన్ని దఫాలుగా పోటీకి దూరంగా ఉన్న గురునాధ రెడ్డి ఈ సారి మాత్రం పోటీకి సిద్ధమవుతున్నారు.

వైఎస్ హయాంలో...
రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి బి. గురునాథరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తన సోదరుడు బి. నారాయణ రెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో అనంతపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. బి.గురునాథరెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి కి అనుంగు శిష్యుడిగా పేరుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2012లో ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
వైసీపీ నుంచేనా...మరి ఇంకా ఏదైనా?
తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గురునాథరెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన అనంతరం వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడిగా నియమితుడయ్యారు.గురునాథరెడ్డి 2017 నవంబర్ 30న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టీడీపీలో తనకు తిరిగి ప్రాధాన్యత లభించకపోవడంతో గురునాధరెడ్డి అనంతరం 2018లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే 2019, 2024 లో ఆయనకు వైసీపీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఈసారి ఆయన ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.
















Tags:    

Similar News