Andhra Pradesh : ఆలయాలు.. తొక్కిసలాటలు.. ఆంధ్రప్రదేశ్ .. ఏడాదిలో మూడు విషాద ఘటనలు
ఆంధ్రప్రదేశ్ లో వరసగా దేవాలయాల్లో జరుగుతున్న తొక్కిసలాటలు ఆందోళనలు కలిగిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో వరసగా దేవాలయాల్లో జరుగుతున్న తొక్కిసలాటలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆధ్మాత్మికత ప్రజల్లో పెరిగింది. గతంలో పోల్చుకుంటే తిరుపతి నుంచి చిన్న ఆలయం వరకూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరుతున్నారు. అందులోనూ ముఖ్యమైన రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఆధ్యాత్మికత పెరగడంతో ఆలయాలకు రద్దీ పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆలయాలపై, అందులోనూ ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
తిరుపతి తొక్కిసలాటలో...
తిరుపతి తొక్కిసలాట జరిగి ఆరు గురు మరణించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘటన టోకెన్ల ను జారీ సమయంలో తిరుపతిలో తొక్కిసలాటి జరిగి ఆరుగురు మృతి చెందారు. తిరుమలలో దర్శనానికి ఈ టోకెన్లు జారీ చేయడంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం అంచనాకు మించి భక్తులు రావడంతోనే ఈ తొక్కసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే న్యాయవిచారణలో కూడా వెల్లడయింది. బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ప్రాణాలు మాత్రం ఇంకా పోతూనే ఉన్నాయి. దేవుడిని దర్శనం చేసుకుందామని వెళ్లి ఆయన వద్దకే చివరకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.
సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో...
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం లో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గోడ కూలడంతోనే ఏడుగురు మరణించారు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన నిజంగా సంచలనంగా మారింది. వర్షం పడితే గోడ కూలడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. గోడ ఇరవై రోజుల క్రితమే నిర్మించినట్లు తెలిసింది. ఈదురుగాలులు.. వర్షం పడినంత మాత్రాన గోడ కూలిపోతే ఇక గోడ నిర్మాణం ఏ మాత్రం కట్టారన్నది అర్థమవుతుంది. ఎనిమిది మంది మరణాలకు కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. సింహాచలం ప్రమాద ఘటన మరవక ముందే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన కూడా అంతే విషాదాన్ని నింపింది.
శ్రీకాకుళం కాశీబుగ్గలో...
ఏడాదిలోనూ మూడు దుర్ఘటనలు ఆలయాల్లో జరగడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన విషాదంకూడా అంతే సంచలన సృష్టించింది. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం, కార్తీమాసం, ఏకాదశి కావడంతో ఈరోజు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ భావిస్తారు. అయితే ఒక్కసారిగా అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పాటు సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో సరైన ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మృతుల్లో చాలా మంది మహిళలు ఉన్నారని తెలిసింది.