Pawan Kalyan : పవన్ ముభావానికి కారణం అసంతృప్తి కారణమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా ఉండటం లేదు. ఎందుకో ముభావంగా, మౌనంగా ఉంటున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా ఉండటం లేదు. ఎందుకో ముభావంగా, మౌనంగా ఉంటున్నారు. ఆయన గత కొంత కాలంగా కేవలం తన శాఖకు మాత్రమే పరిమితమయ్యారు. తన శాఖకు చెందిన అధికారులతో సమావేశాలు, సమీక్షలతోనే ఆయన సమయం గడుపుతున్నారు. జిల్లాల పర్యటనలకు వెళతారని చెప్పినా ఎందుకో ఆయన దానిని కూడా సీరియస్ గా తీసుకోలేదు. మరొకవైపు అనేక నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని పట్టించుకునే పరిస్థితి కూడా ఇప్పుడు జనసేన నాయకత్వానికి లేదు. ఇక పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కనీసం నెంబరు 2గా అయినా ఉంటారనుకుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని జనసేన క్యాడర్ నుంచి ప్రశ్నలు సూటిగా వస్తున్నాయి.
పట్టుబట్టి సాధిస్తారనుకుంటే...
పవన్ కల్యాణ్ కు రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు. ఇదే తొలిసారి చట్టసభల్లోకి ప్రవేశించవచ్చు. కానీ రెండేళ్లవుతున్నా రాజకీయంగా రాటుదేలకపోతే ఎలా అని జనసేన నేతలే ప్రశ్నిస్తున్నారు. కూటమిలోని మిత్ర పక్షాల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు కూడా నిరాశ ఎదురవుతుంది. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ పై క్యాడర్ లోనూ, నేతల్లోనూ ఎన్నో అంచనాలున్నాయి. పట్టుబట్టి ఎవరినుంచైనా సాధిస్తారన్న నమ్మకం ఉండేది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోవడం పట్ల సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే కొంత అసంతృప్తి మొదలయింది. అయితే పవన్ కల్యాణ్ వ్యూహంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానం కూడా ఉంది.
క్యాడర్ సమస్యలను కూడా...
మంత్రిగా తన బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. తనకు కేటాయించిన శాఖలను గాడిలో పెట్టాల్సిందే. దానిని ఎవరూ కాదనలేరు. కానీ కూటమి అఖండ విజయానికి, జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో గెలవడానికి కారణమయిన క్యాడర్ ను, ద్వితీయ శ్రేణి నేతలను విస్మరించకూడదన్నది తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను, కూటమి పార్టీల మధ్య ఉన్న సమన్వయాన్ని కూడా తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ, అసలు పట్టించుకోకుంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ లో ఏదో అసంతృప్తి ఉన్నట్లు కనపడుతుంది. అందుకే ముభావంగా ఉంటున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.