Janasena Party : పవన్ యాక్షన్ లోకి దిగకపోతే ఇక అంతేనట
జనసేన పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో బలంగా లేదు. పవన్ కల్యాణ్ క్రేజ్.. ఇమేజ్ మీదనే అది ఆధారపడి ఉంది.
జనసేన పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో బలంగా లేదు. పవన్ కల్యాణ్ క్రేజ్.. ఇమేజ్ మీదనే అది ఆధారపడి ఉంది. అయితే మొన్నటి వరకూ ఒక ఎత్తు. పవన్ కల్యాణ్ ను పవర్ లో ఎవరూ చూడలేదు. అధికారంలో లేనప్పుడు ఉండే క్రేజ్ కంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఇమేజ్ కు చాలా తేడా ఉంటుంది. మైండ్ సెట్ లోనూ నాయకుల్లో మార్పు వస్తుంది. అధికారంలోకి రాకముందు ప్రశ్నించడానికే వచ్చామంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించడమే మానేస్తారు.క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. ఈ విషయం అనేక రాష్ట్రాల్లో అనేక మంది విషయాల్లో వెల్లడయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఉపముఖ్యమంత్రిగా మాత్రం...
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడే.ప్రశ్నించే తత్వం ఉన్న నాయకుడే. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నోరు విప్పితే ప్రతిపక్షంపైనే విరుచుకుపడుతున్నారని, అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రశ్నించలేకపోతున్నారన్న ఆవేదన, ఆక్రోశం క్యాడర్ లోనూ, కాపు సామాజికవర్గంలోనూ ఉంది. అనేక విషయాల్లో పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలను, క్యాడర్ ను ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తాము కష్టపడి పనిచేసిన దానికి ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన, నిరాశ, నిస్పృహలు పార్టీ ముఖ్య కార్యకర్తల్లోనూ, పవన్ వీరాభిమానుల్లోనూ వ్యక్తమవుతున్నాయి.
వంద నియోజకవర్గాల్లో...
ఇది పార్టీకి మంచిది కాదంటున్నారు. కూటమి పార్టీలు కలసి ఉంటే గెలుస్తామని బిందాస్ గా కూర్చోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో అందరం కలసి పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ వచ్చిందని, ఇప్పుడు వందకు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పనిచేసే పరిస్థితులు లేవన్నది పవన్ కల్యాణ్ గుర్తిస్తే మంచిదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగి రెండేళ్లు కాకముందే ఈ పరిస్థితి ఉంటే రాను రాను ఇది మరింత పెరుగుతుందని, అది పార్టీకి నష్టం చేకూరుతుందని కొందరు పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా వార్నింగ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నియోజకవర్గాల్లో క్యాడర్, నేతల విషయంలో సీరియస్ యాక్షన్ కు దిగాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరి ఏం జరుగుతందో చూడాలి.