YSRCP : ఉత్తరాంధ్ర నేతలందరిదీ ఒకటే దారిలాగుందిగా... నోరు విప్పరు..బయటకు రారు
వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలన్న స్పృహ నేతలకు కొరవడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలు అస్సలు పార్టీ ఒకటి ఉన్నట్లు వారు గమనిస్తున్నట్లు లేదు
వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలన్న స్పృహ నేతలకు కొరవడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలు అస్సలు పార్టీ ఒకటి ఉన్నట్లు వారు గమనిస్తున్నట్లు లేదు. బయటకు రావడం లేదు. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనంతో పాటు ఆధిపత్యం వహించిన నేతలు ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇందులో మంత్రి పదవులు వెలగబెట్టిన వారు సయితం కనిపించకుండా పోయారు. వారు లేరు.. వీరు లేరు. ఉత్తరాంధ్ర నేతలంతా ఒక తాటిపైన నడుస్తున్నట్లు కనపడుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పలు ఆందోళన కార్యక్రమాలకు కూడా వీరు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
సీనియర్ నేతలు...
ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్ నేతలకు కొదవలేదు. మాటలు మాట్లాడే లీడర్లకు కూడా కొరత లేదు. ఎందుకంటే తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి వంటి నేతలు ఉత్తరాంధ్రలో ఉన్నారు. ఇందులో తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు. మిగిలిన ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి మంత్రులుగా వ్యవహరించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి పథ్నాలుగు నెలలు గడుస్తున్నా ఈ నేతలు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో పాముల పుష్ప శ్రీవాణి అప్పుడో ఇప్పుడో కనిపించి వెళుతున్నారు తప్పించి యాక్టివ్ గా మాత్రం లేరు. మిగిలిన నేతలు మాత్రం అస్సలు సీన్ పైకి రావడమే మానేశారు.
ఈ ఇద్దరు నేతలే...
ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ గా ఉండటంతో పాటు శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆయన గొంతు ఒక్కటే వినిపిస్తుంది. బొత్స పాపం.. రోజూ మీడియాతో మాట్లాడుతున్నప్పటికీ ఆయన అధికార పార్టీపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలు పెద్దగా జనంలోకి వెళ్లడం లేదు. మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కూడా కొంత యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. అంతే తప్పించి సీనియర్ నేతలు మాత్రం మొహం చాటేసినట్లే కనిపిస్తుంది. ధర్మాన వంటి వారు విమర్శలకు దిగితే క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశమున్న ఆ ఛాన్స్ ప్రసాదరావు ఇవ్వడం లేదు. ఇప్పుడే జనంలోకి వచ్చి ప్రయోజనం ఏముందని భావించారో? అనవసరంగా వివాదంలో చిక్కుకుని కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకనో? కానీ ఉత్తరాంధ్ర నేతలు మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.