Mahasena Rajesh: మహాసేన రాజేష్‌కు ఊహించని షాక్

పి.గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ కేటాయించింది

Update: 2024-02-28 04:45 GMT

Mahasena Rajesh:పి.గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ కేటాయించింది. రాజేష్ కు నియోజకవర్గంలో అంతగా పట్టులేదు. స్థానిక నేతలను పక్కన పెట్టి స్థానికేతరుడైన రాజేశ్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది. రాజేష్ నియోజకవర్గానికి చాలా తక్కువగా వచ్చాడని.. అసలు కార్యకర్తలతో కనీసం టచ్ లేదని అంటున్నారు. స్థానిక టీడీపీ నేతలు రాజేష్ కు సహకరించడం కష్టమేనని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అర్థమైపోతూ ఉంది.

రాజేశ్‌కు కేటాయించడానికి జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం అంబాజీపేటలో టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి టీడీపీ జోన్‌-2 పరిశీలకుడు సుజయకృష్ణ రంగారావు హాజరయ్యారు. టీడీపీకి చెందిన 4 మండలాల సమన్వయ కమిటీ నేతలతో సంప్రదింపులు చేపట్టారు. తొలుత అయినవిల్లి మండల నేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఇంతలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోందని తెలిసిన జనసేన నేతలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మహాసేన రాజేశ్‌కు టికెట్‌ రద్దు చేయాలన్నారు. రాజేశ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు ఇచ్చారు. కుర్చీలు, బల్లలను గాల్లోకి విసురుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నేతలు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా కూడా జనసైనికులు అక్కడే ఉన్న హరీశ్‌ కారు అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే టీడీపీ, జనసేన నేతలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహాసేన రాజేష్‌కు టికెట్ కేటాయించడాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. గత ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనకు వచ్చిన ఓట్ల శాతాన్ని గుర్తు చేస్తున్నారు. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపైనా జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News