BJP : రెడ్డికి అడ్డం పడుతున్న కూటమి నేతలు ఎవరో తెలుసా? అందుకే రాజీనామా హెచ్చరిక

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నట్లుంది

Update: 2026-04-07 07:59 GMT

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నట్లుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడనని ఆయన హెచ్చరించడంతో కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. తరచూ ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక ఆరోపణలు కూడా చేయడం చర్చనీయాంశమైంది.

"కమ్మ"టి పాలన అంటూ...
గతంలో ఆదినారాయణ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ప్రభుత్వంలో పాలన "కమ్మ"గా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపాయి. అన్ని కులాలను కలుపుకుని పోవాలని ఆయన ఆ సమావేశంలో హెచ్చరించారు. అదే సమయంలో ఒక కులం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదని గుర్తుంచుకోవాలని కూడా ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఎదుట ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో తర్వాత ఆదినారాయణ రెడ్డి సర్ది చెప్పుకుని తాను ఆ ఉద్దేశ్యంతో అనలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
తాజాగా హాట్ కామెంట్స్...
తాజాగా మరోసారి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కూటమిలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని కీలక సంకేతాలు పంపారు. ప్రజల కంటే పదవి ముఖ్యం కాదన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాజీనామ చేస్తానని హెచ్చరించారు. కొద్దిరోజులు చూస్తానని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News